Delhi: ఢిల్లీలో ఏడాది పాటు బాణాసంచా కాల్చడం నిషేధం
ఆప్ సర్కార్ ఉత్తర్వులు జారీ;
నగరంలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవటంతో పటాసులపై పూర్తిస్థాయిలో నిషేధం విధించినట్టు ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో అన్ని రకాల పటాసులపై ఢిల్లీ తరహా నిషేధాన్ని అమల్లోకి తేవాలని హర్యానా, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీలో గాలి కాలుష్యాన్ని అరికట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గత కొద్ది రోజులుగా విచారణ జరుపుతున్నది. పూర్తిస్థాయిలో బ్యాన్ విధించలేమని సుప్రీంకు యూపీ తెలియజేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడాది పాటు బాణాసంచా కాల్చడం నిషేధించింది. ఢిల్లీ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏకే సింగ్ పర్యావరణ (రక్షణ) చట్టం, 1986 ప్రకారం బాణసంచాపై “శాశ్వత నిషేధం” విధించారు. హస్తిన వాసులు తీవ్ర వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో బాణసంచాపై శాశ్వత నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఏడాది పొడవునా అన్ని రకాల బాణసంచా తయారీ, నిల్వ, విక్రయాలు, ఆన్‌లైన్‌లో డెలివరీలతోపాటు వాటి వినియోగంపై నిషేధం విధిస్తూ ఢిల్లీ పర్యావరణ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది.
చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ వరకు బాణసంచాపై నిషేధం విధిస్తున్నట్లు ఈ ఏడాది సెప్టెంబరులో ఆప్ సర్కారు ప్రకటించింది. అయినా కూడా దీపావళి తర్వాత స్థానికంగా కాలుష్యం పెరగడంపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. బాణసంచా నిషేధం అమలుకాకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. కాలుష్యాన్ని సృష్టించే చర్యలను ఏ మతమూ ప్రోత్సహించదని, బాణసంచాను శాశ్వతంగా నిషేధించే విషయంపై ఒక నిర్ణయానికి రావాలని సూచించింది. ఈ క్రమంలోనే శాశ్వత నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.