Delhli CM Atishi : ఢిల్లీ సీఎం అతిషి పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు
తప్పుపట్టిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్;
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీ సీఎం అతిషి కి షాక్ తగిలింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదైంది. అతిషి తన వ్యక్తిగత అవసరాలకు ప్రభుత్వ వాహనాన్ని వినియోగించారని కల్కాజీ నియోజకవర్గ వాసి అయిన కేఎస్ దుగ్గల్ గోవింద్‌పురి పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.
అతిషి వ్యక్తిగత అవసరాలకు ప్రభుత్వ వాహనాన్ని సమకూర్చిన సౌత్ ఈస్ట్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సంజయ్ కుమార్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పోలీసులను ఆదేశించారు. అతిషి ప్రభుత్వ వాహనంలో కల్కాజీ ఆప్ కార్యాలయానికి ఎన్నికల సామాగ్రి తెప్పించినట్లు కేఎస్ దుగ్గల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ తప్పుపట్టారు. బీజేపీ నేతలు బహిరంగంగా నగదు, బంగారు గొలుసులు పంచుతున్నట్టు తమకు సమాచారం ఉన్నదని, అయినా వాళ్లు ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు కాదా..? అని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ నేతలు బహిరంగంగా డబ్బు, బంగారం పంచుతున్నా ఎన్నికల సంఘానికి కోడ్ ఉల్లంఘించినట్టు కనిపించడం లేదుగాని, అతిషి ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు కనిపిస్తోందా..? అని కేజ్రీవాల్ మండిపడ్డారు. న్యూఢిల్లీలో తనపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ రూ.1100 చొప్పున పంచుతూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నాడని, ఓటర్లు ఆ డబ్బు తీసుకోవాలని, ఓటును మాత్రం అమ్ముకోవద్దని ఆయన సూచించారు.