Artificial Rain: ఢిల్లీలో మేఘ మథనం.. ప్రయోగం విజయవంతం
బురారీ ప్రాంతంలో కృత్రిమ వర్షం
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం వేధిస్తోంది. దీపావళి దగ్గర నుంచి పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయి. గాలి నాణ్యత పూర్తిగా కోల్పోయింది. దీంతో కాలుష్య నివారణ కట్టడికి రేఖా గుప్తా ప్రభుత్వం పూనుకుంది. ఇందులో భాగంగా తొలిసారి కృత్రిమ వర్షాన్ని కురిపించేందుకు ఏర్పాట్లు చేసింది. బురారీ ప్రాంతంలో కృత్రిమ వర్షం కోసం చేసిన ప్రయోగం విజయవంతమైంది. దీంతో అక్టోబర్ 29న మొదటి క్లౌడ్ సీడింగ్ జరిగే అవకాశం ఉంది.
బురారీ ప్రాంతంలో కృత్రిమ వర్షం కోసం ట్రయల్ రన్ జరిగింది. కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ఉపయోగించే సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్‌లను విమానం నుంచి కొద్ది మొత్తంలో విడుదల చేశారు. దీంతో గాలిలో తేమ పరిమితంగా ఉందని.. 20 శాతం కంటే తక్కువగా ఉందని అధికారులు తెలిపారు.
కృత్రిమ వర్షానికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయని ముఖ్యమంత్రి రేఖా గుప్తా గురువారం ఎక్స్‌లో పేర్కొన్నారు. బురారీ ప్రాంతంలో ట్రయల్ రన్ విజయవంతంగా జరిగిందని తెలిపారు. ‘‘ఢిల్లీలో తొలిసారిగా క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. ఇది రాజధాని వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాటంలో ఒక ముఖ్యమైన సాంకేతిక మైలురాయిని సూచిస్తుంది. గురువారం నిపుణులు బురారి ప్రాంతంలో ట్రయల్ టెస్ట్‌ను విజయవంతంగా నిర్వహించారు.’’ అని రేఖా గుప్తా పేర్కొన్నారు.
‘‘వాతావరణ శాఖ ప్రకారం.. అక్టోబర్ 28, 29, 30 తేదీల్లో మేఘావృతమైన పరిస్థితులు ఉంటాయని భావిస్తున్నారు. వాతావరణం అనుకూలంగా ఉంటే అక్టోబర్ 29న ఢిల్లీలో మొదటి కృత్రిమ వర్షం కురిసే అవకాశం ఉంది.’’ అని ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు.
‘‘ఈ చొరవ సాంకేతికంగా చారిత్రాత్మకమైనది మాత్రమే కాదు. ఢిల్లీలో కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఒక శాస్త్రీయ విధానాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ ఆవిష్కరణ ద్వారా రాజధాని గాలిని శుభ్రపరచడం, పర్యావరణాన్ని సమతుల్యం చేయడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.’’ అని రేఖా గుప్తా అన్నారు.
ఢిల్లీలో కృత్రిమ వర్షం కోసం రూ.3.21 కోట్ల రూపాయల వ్యయంతో ఐదు క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించాలనే ప్రతిపాదనను ఢిల్లీ మంత్రివర్గం మే 7న ఆమోదించింది. ఈ ప్రాజెక్టును పూణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (IITM), భారత వాతావరణ శాఖ (IMD) నిపుణుల సమన్వయంతో నిర్వహిస్తున్నారు. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులు, నైరుతి రుతుపవనాల కారణంగా కొంత ఆలస్యం జరుగుతోంది. మొత్తానికి ఈ నెలలో అమలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్లౌడ్-సీడింగ్ కార్యకలాపాలకు అక్టోబర్ 1-నవంబర్ 30 మధ్య అనుమతి ఉంది.