Delhi Doctor Murder: డాక్టర్‌ని చంపితే కూతురునిచ్చి పెళ్లి చేస్తానని నర్సు భర్త హామీ..
మహిళా నర్సుతో డాక్టర్‌కి అక్రమ సంబంధం ఉందని అనుమానం..;
ఢిల్లీ డాక్టర్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఢిల్లీలోని నిమా హాస్పిటల్ లో డాక్టర్ జావెద్ అఖ్తర్ (50)ని ఇద్దరు టీనేజర్లు కాల్చి చంపారు. ఈ కేసులో విచారణ మొదలుపెట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. బుధవారం రాత్రి ఇద్దరు టీనేజర్లు నిమా ఆస్పత్రిలోకి వచ్చారు. అందులో ఒకరి కాలికి గాయం కావడంతో చికిత్స కోసం వచ్చామని ఆ టీనేజర్లు చెప్పడంతో ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న పర్వీన్.. గాయానికి కట్టు కట్టింది.
ఆ తరువాత ఇద్దరు టీనేజర్లు డాక్టర్ కేబిన్ కి వెళ్లారు. ఇంతలో ఆస్పత్రి సిబ్బందికి డాక్టర్ కేబిన్ నుంచి తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. దీంతో అందరూ అక్కడికి వెంటనే వెళ్లి చూడగా.. ఆ ఇద్దరిలో ఒకరు తుపాకీ చేతబట్టుకొని ఉన్నాడు. డాక్టర్ జావెద్ అఖ్తర్ బుల్లెట్ గాయంతో రక్తపు మడుగులో కిందపడి ఉన్నాడు. ఆ తరువాత ఇద్దరు హంతకులు తుపాకీతో సిబ్బంది బెదిరించి అక్కడికి పరారయ్యారు.
డాక్టర్ హత్య కేసు విచారణ చేసిన పోలీసులు సీసీటీవి వీడియోల ఆధారంగా ఇద్దరు హంతకులను గుర్తుపట్టారు. అందులో ఒకరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నట్లు తెలియడంతో అతడిని ట్రాక్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ లో తాజాగా ఆ యువకుడు తుపాకీ చేతబట్టుకొని ఒక ఫొటో అప్‌లోడ్ చేశాడు. 2024లో నా ఫస్ట్ మర్డర్ అని క్యాప్షన్ పెట్టాడు. అతని సోషల్ మీడియా అకౌంట్ పోలీసులు ట్రాక్ చేసి హంతకుడిని పోలీసులు పట్టుకున్నారు.
పోలీస్ స్టేషన్ లో అతడిని హత్య కేసులో ప్రశ్నించగా.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం.. నిందితులలో ఓక యువకుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి తండ్రి వారిద్దరికీ పెళ్లి చేయడానికి ఒక షరతు విధించాడు.ఒక డాక్టర్ ని హత్య చేయాలని అమ్మాయి తండ్రి చెప్పాడు. ఆ హత్య చేస్తేనే వారి పెళ్లికి అనుమతి ఇస్తానని అన్నాడు. ఆ డాక్టర్ మరెరవో కాదు. నిమా హాస్పిటల్ లో పనిచేసే డాక్టర్ జావెద్ అఖ్తర్.
అయితే ఈ కేసులో మరో ట్విస్టు ఉంది. నిమా ఆస్పత్రిలో పనిచేసే నర్సు పర్వీన్ మరెవరో కాదు. యువకుడు ప్రేమించిన అమ్మాయికి తల్లి. అంటే హత్యచేయమని షరతు విధించింది మరెవరో కాదు.. నర్స్ పర్వీన్ భర్త. డాక్టర్ జావెద్ అఖ్తర్ , నర్సు పర్వీన్ మధ్య అక్రమ సంబంధం ఉందని.. అందుకే ఆ డాక్టర్ ను చంపేయాలని అడిగాడు పర్వీన్ భర్త. పైగా హత్య చేయడానికి ఒక తుపాకీ కొనుగోలు చేసేందుకు డబ్బులు కూడా ఇచ్చాడు.
నర్సు పర్వీన్ భర్త బ్యాంక్ ఏటియం కార్డు ద్వారా యువకుడు డబ్బులు కూడా విత్ డ్రా చేశాడు. ఆ తరువాత తన స్నేహితుడి కాలికి గాయమైనట్లు ఆస్పత్రికి వెళ్లి డాక్టర్ జావెద్ అఖ్తర్ ని తుపాకీతో కాల్చి చంపాడు. ప్రస్తుతం పోలీసులు డాక్టర్ జావెద్ అఖ్తర్ హత్య కేసులో నిందితుడు ని అరెస్టు చేశారు. నర్సు పర్వీన్ భర్త పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.