Delhi: ఢిల్లీ ద్వారకా నగర్‌లో కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి.. ప్రియుడితో కలిసి భర్త హత్య?
ఇద్దరూ కుట్ర పన్ని చంపినట్లు వాట్సాప్ చాట్‌తో వెలుగులోకి..;
ఢిల్లీలోని ద్వారకాలో 36 ఏళ్ల వ్యక్తి కరెంట్ షాక్‌తో మరణించాడు. అయితే, ఈ సంఘటనలో అతని భార్య, ఆమె ప్రియుడి కుట్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. మరణించిన వ్యక్తిని కరణ్ దేవ్‌గా గుర్తించారు. ఉత్తమ్‌నగర్‌లో మాతా రూప్రాణి మాగో ఆస్పత్రి నుంచి జూలై 13న పీసీఆర్ వచ్చినట్లు పోలీసులు చెప్పారు. వ్యక్తిని అతని భార్య, ఆమె లవర్ అయిన కరణ్ మామ కుమారుడు కలిసి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
మృతుడి భార్య, ఆమె ప్రియుడు కరణ్‌కు నిద్రమాత్రలు ఇచ్చి, మత్తు వచ్చిన తర్వాత విద్యుత్ షాక్ ఇచ్చి చంపినట్లు ఆరోపించారు. హత్య తర్వాత ఆమె తన సమీపంలోని అత్తమామల ఇంటికి వెళ్లి కరణ్ చనిపోయినట్లు సమాచారం అందించింది. వారు అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడు స్పందించలేని స్థితిలో ఆస్పత్రికి తీసుకువచ్చారు.
‘‘ప్రారంభంలో కరణ్ కుటుంబం ఎలాంటి ఆరోపణలు చేయలేదు. పోస్టుమార్టం పరీక్ష కూడా వద్దనుకుంది. అయితే, చిన్న వయసు పరిగణలోకి తీసుకుని, ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ (DDU) ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించబడింది’’ అని ద్వారకా డీసీపీ అంకిత్ సింగ్ చెప్పారు. బుధవారం కరణ్ తమ్ముడు కునాల్ దేవ్, తన అన్న మరణం చుట్టూ ఉన్న పరిస్థితులపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసుల్ని ఆశ్రయించారు. కరణ్ భార్య, ఆమె భాగస్వామి కలిసి అతడిని చంపాలని ప్లాన్ చేసినట్లు వాట్సాప్ చాట్‌లో గుర్తించినట్లు పోలీసులు కనుగొన్నారు. ఇద్దరిపై హత్య నేరం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.