Delhi Encounter : ఢిల్లీలో ఎన్‌కౌంటర్‌.. నలుగురు బీహార్‌ మోస్ట్‌వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్లు హతం

బీహార్‌ ఎన్నికల్లో కుట్రకు ప్రణాళిక

Update: 2025-10-23 01:45 GMT

 దేశరాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌   జరిగింది. ఢిల్లీ క్రైం బ్రాంచ్‌, బీహార్‌ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో బీహార్‌కు చెందిన నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లను హతమయ్యారు. ఈ ముఠా కదలికపై స్పష్టమైన సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున 2.20 గంటల సమయంలో బహదూర్‌ షా మార్గ్‌ వద్ద పోలీసులకు, గ్యాంగ్ స్టర్లకు మధ్య కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నలుగురు నిందితులను రోహిణిలోని డాక్టర్ బీఎస్ఏ హాస్పిటల్‌కు తరలించగా, వారు అప్పటికే చనిపోయారని వైద్యులు నిర్ధారించారు.

మృతులను రంజన్ పాఠక్  , బీమ్‌లేష్ మహతో  , మనీష్ పాఠక్ ,  అమన్ ఠాకూర్గా గుర్తించారు. అమన్‌ ఠాకూర్‌ స్వస్థలం ఢిల్లీలోని కార్వాల్‌ నగర్‌ కాగా, మిగిలిన ముగ్గురు బీహార్లోని సీతామర్హి ప్రాంతానికి చెందిన మోస్ట్ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్లు. బీహార్ ఎన్నికలకు ముందు ఈ నలుగురు పెద్ద కుట్రకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా, కాల్పులకు పాల్పడ్డారని, ప్రతిగా పోలీసులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. దీంతో వారిని రోహిణిలోని దవాఖానకు తరలించామని, అయితే అప్పటికే మరణించారని డాక్టర్లు చెప్పారన్నారు. ఘటనా స్థలాన్ని ఢిల్లీ, బీహార్‌కు చెందిన సీనియర్‌ పోలీస్‌ అధికారులు పరిశీలించారని, ఆధారాలు సేకరించేందుకు ఫోరెన్సిక్‌ బృందాలకు సమాచారం అందించామని ఢిల్లీ క్రైమ్‌బ్రాంచ్‌ డీసీపీ సంజీవ్‌ యాదవ్‌ తెలిపారు. కాగా, బీహార్‌లో చాలా క్రిమినల్ కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఈ ముఠాకు రంజన్ పాఠక్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ నేరస్థులు బీహార్‌లో నమోదైన అనేక ప్రధాన కేసుల్లో పరారీలో ఉన్నారు. ఢిల్లీ, బీహార్ పోలీసులు చాలా కాలంగా ఈ ముఠాపై పోలీసులు నిఘా పెట్టారు.

Tags:    

Similar News