AP: ఏపీలో విప్లవం.. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి శ్రీకారం
అమరావతిలో చారిత్రాత్మక ఘట్టానికి ముందడుగు.. సాంకేతిక రంగాన్ని మలుపు తిప్పే చారిత్రక ఘట్టం.. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి పునాదిరాయి.. క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మణానికి శంకుస్థాపన
దేశ సాంకేతిక భవిష్యత్తును కొత్త దిశగా మలిచే చారిత్రక ఘట్టానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికైంది. ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అమరావతి క్వాంటమ్ వ్యాలీ’ ప్రాజెక్టు నిర్మాణానికి శనివారం శుభారంభం జరిగింది. తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామంలో ఈ కీలక ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డా. జితేంద్ర సింగ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ప్రాజెక్టు ద్వారా దేశంలో క్వాంటమ్ విప్లవానికి నాయకత్వం వహించే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ అందిపుచ్చుకోనుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. అమరావతిని ప్రపంచ స్థాయి క్వాంటమ్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈ వ్యాలీని రూపకల్పన చేశారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 50 ఎకరాల భూమిని కేటాయించగా, అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ప్రధానంగా ఈ క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, క్వాంటమ్ సెన్సర్స్, కృత్రిమ మేధ (AI), సైబర్ సెక్యూరిటీ, రక్షణ రంగం, ఆరోగ్య సేవలు, ఫైనాన్స్ వంటి కీలక రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలు జరగనున్నాయి. అంతేకాకుండా యువతకు అత్యున్నత స్థాయి నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా భారతదేశపు తొలి 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ను అమరావతిలో ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టారు.
ఈ దిశగా ఐబీఎం, టీసీఎస్, ఎల్అండ్టీ వంటి ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ సంస్థలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. క్వాంటమ్ కంప్యూటర్ స్థాపనతో పరిశోధన రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుతో ప్రపంచ స్థాయి పరిశోధనా కేంద్రాలు అమరావతి వైపు ఆకర్షితమవుతాయని, అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టే అవకాశాలు పెరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు ఇది పెద్ద ఊతమిచ్చే ప్రాజెక్టుగా మారనుంది. వేలాది కొత్త స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థలు ఏర్పడి, లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఈ ప్రాజెక్టును నిర్ణీత గడువుల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఆగస్టు నెలాఖరుకు క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణాన్ని పూర్తిచేసి, డిసెంబరు నాటికి క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కార్యరూపం దాల్చితే అమరావతి ప్రపంచ క్వాంటమ్ మ్యాప్‌పై ప్రత్యేక స్థానం సంపాదించనుంది. ప్రస్తుతం ప్రపంచంలో బోస్టన్, సింగపూర్, షాంఘై వంటి నగరాలు క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రాలుగా గుర్తింపు పొందాయి. వాటితో సమానంగా అమరావతిని నిలపాలన్నదే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం. దీర్ఘకాలిక దృష్టితో రూపొందించిన ఈ క్వాంటమ్ వ్యాలీ, ఆంధ్రప్రదేశ్‌కే కాదు, దేశానికే గర్వకారణం.