Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం..

మెట్రో సేవలు లేక ప్రయాణికులతో కిక్కిరిసిన స్టేషన్లు

Update: 2025-08-29 07:00 GMT

దేశ రాజధాని ఢిల్లీని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక భారీ వర్షాలు కారణంగా ఉద్యోగస్థులంతా మెట్రో రైలుపైనే ఆధారపడ్డారు. అయితే భారీ వర్షాలు కారణంగా పలు స్టేషన్లలో మెట్రో రైల్వే సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులతో స్టేషన్లు కిటకిటలాడాయి. అంతేకాకుండా 170 విమాన సర్వీసులకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమాన ప్రయాణికులంతా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.

శుక్రవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో స్కూల్‌కు వెళ్లేవారు.. ఉద్యోగాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కీలక మార్గాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డీఎన్‌డీ ఫ్లైవే, మధుర రోడ్, వికాస్ మార్గ్, ఐఎస్‌బీటీ, గీతా కాలనీ, రాజారామ్ కోహ్లీ మార్గ్‌లో అంతరాయం కలిగింది. బాదర్‌పూర్ నుంచి ఆశ్రమం వరకు వాహనాలు పెద్ద ఎత్తున క్యూలో ఉండడంతో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, పాఠశాల బస్సులు నెమ్మదిగా కదిలాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షం కారణంగా నీరు నిలిచిపోవడంతో ఈ అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు.

ఇక మెట్రో సర్వీసులపై ఆధారపడ్డ ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు ఎదురయ్యాయి. కీలక మార్గాల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో మెట్రోపై ఆధారపడ్డ విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రయాణికులతో స్టేషన్లు కిటకిటలాడాయి. విశ్వవిద్యాలయ-సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్ల మధ్య రైలు సర్వీసులలో ఆలస్యం జరిగిందని మెట్రో పేర్కొంది. అంతేకాకుండా విమాన ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాలు కారణంగా విమాన సర్వీసులు ఆలస్యం అవుతున్నట్లు ఆయా సంస్థలు తెలిపాయి.

Tags:    

Similar News