Amit Shah: అమిత్ షా ఫేక్ వీడియోపై మోదీ వార్నింగ్

మార్ఫింగ్‌ కేసు లో పలువురు కాంగ్రెస్‌ నేతలకు నోటీసులు

Update: 2024-04-29 23:15 GMT

సమాజంలో అగ్గిరాజేసేందుకు, ఉద్రిక్తతలను సృష్టించేందుకు సాంకేతికత సాయంతో నకిలీ వీడియోలను విపక్ష నేతలు తయారు చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో పెరుగుతున్న నకిలీ మీడియోల ప్రసారంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వీడియోలు తయారు చేసే వారికి తగిన బుద్ధి చెబుదామని ప్రజలకు పిలుపునిచ్చారు.

రిజర్వేషన్ల రద్దుపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మాట్లాడినట్లుగా ఉన్న ఓ నకిలీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన వేళ...దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. సమాజంలో అలజడిని సృష్టించేందుకు సాంకేతికత సాయంతో విపక్ష నేతలు నకిలీ వీడియోలను తయారు చేస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకలోని బాగల్‌కోటేతో పాటు మహారాష్ట్రలోని షోలాపూర్‌, సతారా, కరాడ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ..సామాజిక మాధ్యమాల్లో పెరుగుతున్న ఫేక్‌ వార్తల ప్రసారంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ వీడియోలను షేర్‌ చేయవద్దని ప్రజలను కోరారు. ఫేక్‌ వీడియోల నుంచి సమాజాన్ని రక్షించడం అందరి బాధ్యతని మోదీ గుర్తుచేశారు. విపక్షాలు కృత్రిమ మేథను ఉపయోగించి తన గొంతు, భాజపా నేతల గొంతుతో నకిలీ వీడియోలు తయారు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ వీడియోల గురించి సమాచారం తెలిస్తే పార్టీ కార్యాలయంలో గానీ, పోలీసులకు గానీ ఫిర్యాదు చేస్తే.. బాధ్యులకు తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం కూడా చర్యలు తీసుకోవాలని మోదీ విజ్ఞప్తి చేశారు.

రిజర్వేషన్లపై మాట్లాడిన ప్రధాని.. రాజ్యాంగ బద్ధంగా హక్కులు ఉన్న వారి నుంచి రిజర్వేషన్లు లాక్కొని.. వాటిని మైనారిటీలకు ఇవ్వాలని కాంగ్రెస్ చూసిందని మండిపడ్డారు. వెనుకబడ్డ తరగతుల హక్కులను లాక్కోకుండానే జనరల్‌ కేటగిరీలోని ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు 10శాతం రిజర్వేషన్లు అమలు చేశామన్నారు. ఆ విధానం వల్ల దేశంలో వివిధ వర్గాల ప్రజల మధ్య ఏ విభజనా ఏర్పడలేదని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్‌ మాత్రం ఓటు బ్యాంకు కోసం దేశంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని యోచిస్తోందని ధ్వజమెత్తారు. SC, ST, OBCలు భాజపా వెంట ఉన్నందున.. కాంగ్రెస్‌ మైనారిటీలను ప్రసన్నం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తోందన్నారు. దళితులు, గిరిజనులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడేందుకు తాను ఎంతకైనా తెగిస్తానని మోదీ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి పదవిని సంవత్సరానికి ఒకరికి చొప్పున పంచాలని ఇండీ కూటమి నిర్ణయించిందని ప్రధాని మోదీ ఆరోపించారు. 

Tags:    

Similar News