Delhi pollution: ఢిల్లీ ఆఫీసుల్లో 50% హాజరే : వాయు కాలుష్యం వేళ ప్రభుత్వ ఆదేశం
ఆరు బయట విద్యార్థులను ఆడించొద్దని స్కూళ్లకు ఆదేశాలు
ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానుల జాబితాలో మన ఢిల్లీ నగరం ముందుంటుంది. అక్కడ వాయు కాలుష్యం భయంకరంగా మారింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు 50% మందే పని చేయాలని, మిగతావారు ఇంటి నుంచే పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పిల్లలను బయట ఆడనివ్వద్దని, విద్యా సంస్థలపై కూడా ఆంక్షలు విధించారు. కాలుష్యంపై ప్రజలు ఆగ్రహంతో ఆందోళనలు చేయగా, పోలీసులతో ఘర్షణ జరిగింది. AQI 400 దాటడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పనిసరి అయ్యింది.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాలు 50 శాతం మందితో పనిచేయాలని, మిగతా వారు ఇంటి నుంచి పనిచేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ లెవెల్ 3 (GRAP-3)లో భాగంగా ఈ నిబంధనలు అమల్లోకి వచ్చారు. ఢిల్లీ కాలుష్య తీవ్రతతో ప్రభుత్వం ఇప్పటికే విద్యా సంస్థల కొన్ని పరిమితులు విధించింది. ముఖ్యంగా, వాయు నాణ్యత ప్రమాదకరంగా ఉన్నప్పుడు పిల్లలను బహిరంగ ప్రదేశాల్లో ఆటలకు అనుమతించవద్దని సూచించింది.
అదేవిధంగా, గురు తేజ్ బహాదూర్ 350వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో మంగళవారం ప్రభుత్వ కార్యాలయాల్లో హాజరు శాతం తక్కువగా ఉండనుంది. శీతాకాలంలో తీవ్రమవుతున్న వాయు కాలుష్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, GRAP స్థాయిల ఆధారంగా ఆంక్షలను అమలు చేస్తోంది. కాలుష్య తీవ్రత ఎక్కువయ్యే కొద్దీ నిబంధనలు కూడా మారుతాయి. కమిషన్ ఫర్ ఎయిర్ క్యాలిటీ మేనేజ్‌మెంట్ జాతీయ రాజధాని ప్రాంతంలో డేటాను సేకరిస్తుంది. వాయు నాణ్యత ఇండెక్స్ (AQI), వాతావరణ పరిస్థితుల ఆధారంగా, వివిధ విభాగాలు, అధికారుల సమన్వయంతో తగిన చర్యలను చేపడుతుంది.
మరోవైపు, ఢిల్లీలో కాలుష్య తీవ్రతపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం మెరుపు ఆందోళనలకు దిగిన ప్రజలు.. ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. హింసాత్మకంగా మారి.. పోలీసులపై కారం పొడి, పెప్పర్ స్ప్రేలతో దాడులు చేశారు. ఈ ఘటనలో 22 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా.. ఆరుగుర్ని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఏడాది శీతాకాలం ప్రారంభమైన తర్వాత ఢిల్లీలో గత రెండు రోజుల నుంచి వాయు నాణ్యత మరింత ప్రమాదరక స్థాయికి పడిపోయింది. అనేక ప్రాంతాల్లో ఏక్యూఐ 400 దాటేసింది. దీంతో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.