Delhi: ప్రియుడిని చంపి.. మృతదేహంపై నెయ్యి, వైన్‌ .

ఫోరెన్సిక్‌ చదువు, క్రైమ్‌షోలు చూసిన అనుభవంతో ప్రణాళిక

Update: 2025-10-28 01:15 GMT

ఢిల్లీ పోలీసులు ఒళ్లు గగుర్పొడిచే ఓ హత్య కేసును ఛేదించారు. ఓ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, ఓ యువతి , యువకుడు మే నెల నుంచి తిమర్‌పూర్‌లోని గాంధీ విహార్‌లో సహజీవనం చేస్తున్నారు. ఆమె ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో బీఎస్‌సీ ఫోరెన్సిక్‌ సైన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులు చేసింది. ఆయన యూపీఎస్‌సీ పరీక్షల కోసం చదువుతున్నాడు. తన అసభ్యకరమైన వీడియోలను ఆయన చిత్రీకరించి, హార్డ్‌ డిస్క్‌లో సేవ్‌ చేసినట్లు ఆమె గుర్తించింది. వాటిని డిలీట్‌ చేయమని అతనిని కోరింది. కానీ అతను తిరస్కరించి, కట్టుకథలు చెప్పి, అవమానించాడు. దీంతో ఆమె తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ని సంప్రదించింది. అతను, మరొకరితో కలిసి వచ్చాడు. సహజీవనం చేస్తున్న యువకుడిని చంపడానికి కుట్ర పన్నారు.

నిందితురాలు తన ఫోరెన్సిక్‌ చదువును, క్రైమ్‌ షోల ద్వారా సంపాదించిన విజ్ఞానాన్ని ఉపయోగించి, హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రణాళిక రచించింది. ఈ నెల 5న రాత్రి ముగ్గురూ కలిసి ఫ్లాట్‌కు వెళ్లారు. అతని గొంతు నులిమి, తీవ్రంగా కొట్టి, చంపేశారు. ఆ తర్వాత మృతదేహం మీద నెయ్యి, మద్యం జల్లారు. మాజీ బాయ్‌ఫ్రెండ్‌ మొరాదాబాద్‌లో ఎల్‌పీజీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్‌గా పని చేస్తున్నాడు. గ్యాస్‌ సిలిండర్‌ను ఎలా పేల్చాలో అతనికి తెలుసు. కాబట్టి, మృతదేహం తల వద్ద గ్యాస్‌ సిలిండర్‌ను పెట్టి, రెగ్యులేటర్‌ తెరచి, లైటర్‌తో వెలిగించారు. ఓ గంట తర్వాత సిలిండర్‌ పేలింది, మృతదేహం పూర్తిగా కాలిపోయింది.

మృతుని కజిన్‌ సీసీటీవీ ఫుటేజ్‌ని గమనించారు. మంటలు ఎగసిపడటానికి ముందు ఇద్దరు వ్యక్తులు భవనంలోకి వెళ్తున్నట్లు, మంటలు రాజుకోవడానికి కాస్త ముందు ఓ మహిళ వెళ్లిపోతున్నట్లు గుర్తించారు. దీంతో ఇది హత్య అనే అనుమానం వచ్చింది. పోలీసులు సీసీ ఫుటేజ్‌, కాల్‌ రికార్డ్స్‌ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేశారు.

Tags:    

Similar News