Building Collapses: ఢిల్లీలో కుప్పకూలిన భవనం.. నలుగురు మృతి
రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందం.. కొనసాగుతున్న సహాయక చర్యలు..;
తూర్పు ఢిల్లీలోని ముస్తఫాబాద్ ప్రాంతంలో ఆరు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు మృత్యువాతపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. కూలిపోయిన భవనంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయని ప్రాథమిక సమాచారం. గురువారం రాత్రి సమయంలో ఈ ఘటన జరిగిందని అదనపు పోలీస్ కమిషనర్ వినీత్ కుమార్ పేర్కొన్నారు. సంఘటనా స్థలానికి చేరుకునే సరికి భవనం కూలిపోయి.. భారీగా దుమ్ము రేగిందని పేర్కొన్నారు.
నలుగురు చనిపోయారని.. ఇద్దరు గాయపడ్డట్లు తెలిపారు. మధు విహార్ పోలీస్ స్టేషన్ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయి ఒకరు మరణించగా, ఇద్దరు గాయపడ్డారు. డివిజనల్ ఫైర్ ఆఫీసర్ రాజేంద్ర అత్వాల్ మాట్లాడుతూ.. తెల్లవారుజామున 2.50 గంటల ప్రాంతంలో ఇల్లు కూలిపోయినట్లు సమాచారం అందిందని పేర్కొన్నారు. సంఘటనా స్థలానికి చేరుకుని మొత్తం భవనం కూలిపోయిందన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ బృందాలు కలిసి సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఓ ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ కూలిపోయిన ఆరు అంతస్తుల భవనంలో ఇద్దరు వ్యక్తులు.. ఇద్దరు మహిళలు ఉన్నట్లుగాప్రత్యక్ష సాక్షి తెలిపింది. ఓ మహిళకు ముగ్గురు పిల్లలు, మరో మహిళలకు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారని.. ప్రస్తుతం వారు ఎక్కడా కనిపించడం లేదని చెప్పింది.