Delhi Ari Pollution : దీపావళి ఎఫెక్ట్‌.. ఢిల్లీలో పడిపోయిన గాలి నాణ్యత

ప్రమాదకరమన్న కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి

Update: 2025-10-21 04:15 GMT

దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత  రోజురోజుకు పడిపోతున్నది. దీపావళి వేడుకల అనంతరం వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్నది. మంగళవారం ఉదయం 7 గంటల సమయానికి గాలి నాణ్యత సూచీ (AQI) 347 పాయింటకలు పెరిగింది. దీంతో వెరీ పూర్‌ కేటగిరిలో గాలి నాణ్యత కొనసాగుతున్నది. ఇది చాలా ప్రమాదకరమని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఏక్యూఐ 491గా నమోదయింది. దీంతో ప్రజలు కళ్లు, ముక్కు, గొంతులో మంట, దురద సమస్యలు తలెత్తుతున్నాయి. మాస్క్ ధరించాలని, ఉదయం పూట ఆరుబయట తిరగవద్దని వైద్య నిపుణులు సూచించారు. కాగా, దీపావళి పటాకులు, వ్యవసాయ వ్యర్థాలు కాల్చడమే కాలుష్యానికి కారణమని పీసీబీ వెల్లడించింది. నిర్మాణ వ్యర్థాలు కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తెలిపింది.

పర్యావరణ హితమైన పటాకులు కాల్చేందుకు సుప్రీం కోర్టు అనుమతించడంతో సోమవారం సాయంత్రం ఢిల్లీలో ప్రజలు పెద్దఎత్తున మోత మోగించారు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, కోర్టు ఆదేశాలను ప్రజలు పట్టించుకోలేదు. దీంతో రాత్రికి రాత్రే గాలి నాణ్యత మరింత క్షీణించింది. వాజీపూర్‌లో ఏక్యూఐ 435గా నమోదవగా, ద్వారకా 422, అశోక్‌ విహార్‌ 445, ఆనంద్‌ విహార్‌ 440 పాయింట్లుగా నమోయింది. దీంతో ఈ ప్రాంతాలు రెడ్‌ జోన్‌లో ఉన్నాయి.

గాలి న్యాణ్యత సూచీ 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి కాలుష్యం లేదని.. అదే 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని.. ఇక 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, ఏక్యూఐ 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ చెబుతున్నది. వాయు కాలుష్యం నేపథ్యంలో 2020 నుంచి దేశ రాజధానిలో దీపావళికి పటాకులు కాల్చడంపై నిషేధం అమల్లో ఉన్నది. అయితే ప్రభుత్వం మారడంతో ఈ బ్యాన్‌ను ఎత్తివేశారు.

Tags:    

Similar News