PM Modi: హిందూ మతాన్ని ధ్వంసం చేయడమే ‘ఇండియా’ కూటమి ఎజెండా
'శక్తి' వ్యాఖ్యలపై రాహుల్ గాంధీని మళ్లీ టార్గెట్ చేసిన ప్రధాని మోడీ;
ప్రతిపక్ష ఇండియా కూటమి హిందూ మతాన్ని టార్గెట్ చేసిందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. పదేపదే హిందూ మతాన్ని అవమానించే కాంగ్రెస్, డీఎంకేలు ఇతర మతాల జోలికి మాత్రం వెళ్లబోవన్నారు. భారీ అవినీతి, ఒకే కుటుంబపాలనకు ఆ రెండు పార్టీలు ఒకేనాణేనికి రెండుముఖాల వంటివన్నారు. తమిళనాడు అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇటీవల ముంబయిలో జరిగిన ర్యాలీలో శక్తిపై విమర్శలు చేసిన నేపథ్యంలో ఇండియాకూటమిపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఎన్డీయే అభ్యర్థుల తరఫున తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని మోదీ...సేలం సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్, డీఎంకేలను లక్ష్యంగా చేసుకొని ఎదురుదాడిచేశారు. కాంగ్రెస్, డీఎంకేలు హిందూ మతాన్ని నాశనం చేయాలని చూస్తున్నాయని, కానీ అవే నాశనం అవుతాయని అందుకు పురాణాలు, ఇతిహాసాలే సాక్ష్యమన్నారు. వచ్చేనెల 19న తమిళనాడు ప్రజలు మొదట అదేపని చేయబోనున్నారని ప్రధాని మోదీ చెప్పారు. తమిళనాట 39లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగే తేదీని ప్రస్తావిస్తూ...ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి...హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకుందని ప్రధాని మోదీ ఆరోపించారు. హిందూమతాన్ని నాశనం చేయాలనే ప్రకటనల ద్వారా...కాంగ్రెస్, డీఎంకేలు తమ దురుద్దేశాన్ని చాటుకున్నాయన్నారు. పదేపదే హిందూమతాన్ని అవమానించే ఆ రెండుపార్టీలు...ఇతరమతాల జోలికి మాత్రం వెళ్లబోవన్నారు. జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి మదర్ ఇండియాను శక్తిగా ఆరాధించారని మోదీ గుర్తుచేశారు. శక్తిని నాశనం చేస్తామన్న వారిని తమిళనాడు ప్రజలు శిక్షిస్తారని, తాను శక్తి ఆరాధకుడినని ప్రధాని మోదీ తెలిపారు. కాంగ్రెస్, డీఎంకేలు ఒక నాణేనికి రెండు ముఖాల వంటివన్నారు.
తమిళనాడు అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ తెలిపారు. అందువల్లే తమిళనాడులో భాజపాకు ఆదరణ పెరుగుతోందన్నారు. పదేళ్ల క్రితం సేలం జిల్లాలో పార్టీ నేత, ఆడిటర్ వి.రమేశ్ హత్యకు గురైన విషయాన్ని గుర్తుచేసిన ప్రధాని మోదీ...కొంత భావోద్వేగానికి గురయ్యారు. కాసేపు తన ప్రసంగాన్ని నిలిపేశారు. తమిళనాడు మాజీ సీఎం కామరాజ్ నిజాయితీ, మధ్యాహ్న భోజన పథకం విప్లవాత్మక పథకాలు తనకు అతిపెద్ద ప్రేరణ అని ప్రధాని మోదీ తెలిపారు.
అంతకుముందు కేరళలోని పాలక్కాడ్‌లో ప్రధాని మోదీ అట్టహాసంగా రోడ్‌షో నిర్వహించారు. ఉదయం కోయంబత్తూర్ నుంచి పాలక్కాడ్ చేరుకున్న ప్రధానికి భాజపాశ్రేణులు, స్థానికులు అపూర్వస్వాగతం పలికారు. పూలతో అందంగా అలంకరించిన ఓపెన్ టాప్ జీపుపై కాషాయరంగు నెహ్రూటోపి ధరించి ప్రధాని మోదీ రోడ్‌షో నిర్వహించారు. కిలోమీటరు పొడవునా సాగిన రోడ్‌షో సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా బారులుతీరిన భాజపా శ్రేణులు, స్థానికులు ప్రధాని మోదీపై పూలవర్షం కురిపించారు.