Delimitation: దక్షిణాది హక్కుల శంఖారావం
నేడు స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలో సమావేశం... హాజరుకానున్న రేవంత్ రెడ్డి, కేటీఆర్;
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడేందుకు తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో నేడు అఖిలపక్ష సమావేశం జరగనుంది. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చూపుతున్న సవతి తల్లి ప్రేమకు నిరసనగా పార్టీలకతీతంగా ఉద్యమాన్ని లేవనెత్తాలని స్టాలిన్ నిర్ణయించారు. ఈ భేటీకి దక్షిణాది రాష్ట్రాల సీఎంలు హాజరు అవుతారని తెలుస్తోంది. కేరళ సీఎం ఇప్పటికే చెన్నై చేరుకున్నారు. జనాభా ప్రాతిపదికన నియోజక వర్గాల పునర్విభజన చేయనున్నట్టు కేంద్రప్రభుత్వం ప్రకటించగా.. దీనిని దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తక్కువగా ఉంటుందని, తద్వారా డిలిమిటేషన్ విధానం ద్వారా సౌత్ లోని రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని తెలుపుతున్నారు. డిలిమిటేషన్ విధానాన్ని రద్దు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చేలా తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష సమావేశం నేడు జరగనుంది.
సమావేశానికి 20 పార్టీలు
ఈ అఖిలపక్ష సమావేశంలో పాల్గొనేందుకు 20కు పైగా పార్టీలు సమ్మతించాయని డీఎంకే వర్గాలు వెల్లడించాయి. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అది జనాభా నియంత్రణకు కృషి చేసిన రాష్ట్రాలకు నష్టం చేకూరుస్తుందని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆరోపిస్తున్నారు. ఈ భేటీకీ హాజరై తమ ప్రయత్నాలకు మద్దతు తెలపాలంటూ దక్షిణాది రాష్ట్రాలతో పాటు పశ్చిమబెంగాల్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో ఎంపీలను కలిగిన పార్టీల నేతలు, ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపారు. అందుకు 20కు పైగా పార్టీల అగ్రనేతలు సమ్మతించారని డీఎంకే వర్గాలు తెలిపాయి.
ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, కేటీఆర్
జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తమిళనాడు సీఎం స్టాలిన్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పాల్గొంటున్నారు. ఈ భేటీలో పాల్గొంటామని ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. దీంతో రేవంత్- కేటీఆర్ ఒకే వేదికపై కనిపించనున్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై రేవంత్.. ఉన్నతస్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ తోపాటు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తోపాటు, పలువురు రాజ్యసభ ఎంపీలు హాజరవనున్నారు.