SIR: ‘‘సర్’’పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన డీఎంకే..
లక్షలాది మంది ఓట్లు పోతాయని పిటిషన్..
దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. బీహార్‌లో ఇప్పటికే ఇది వివాదాస్పదం అయింది. నకిలీ ఓటర్లను తీసేస్తున్నామని ఎన్నికల సంఘం చెబుతున్నప్పటికీ, ఇది ఉద్దేశపూర్వకంగా బీజేపీకి సహకరించేందుకు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇదిలా ఉంటే, తమిళనాడులో ఎన్నికల కమిషన్ చేపట్టే ఓటర్ల జాబితా సవరణను సవాల్ చేస్తూ డీఎంకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ ప్రక్రియ లోక్‌సభ ఎన్నికలకు ముందు నిజమైన ఓటర్లను పెద్ద ఎత్తున ఓటు హక్కును కోల్పోవడానికి దారి తీస్తుందని ఆరోపించింది. డీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ఎస్ భారతి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తగిన ప్రక్రియ లేకపోవడం, అసమంజసంగా తక్కువ సమయం ఉండటం వలన ఓటర్ల జాబితా నుంచి లక్షలాది మంది నిజమైన ఓటర్ల తొలగింపుకు దారి తీయవచ్చని పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఏకపక్షంగా, తగిన ప్రక్రియ లేకుండా చేసే సర్ వల్ల లక్షలాది మంది ఓటర్లు తమ ప్రతినిధిని ఎన్నుకునే హక్కును కోల్పోతారు అని, ఇది స్వేచ్ఛాయుత ఎన్నికలకు అంతరాయం కలిగిస్తుందని డీఎంకే వాదిస్తోంది.
తమిళనాడు సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కూడా ఎన్నికల కమిషన్ పై విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు నిజమైన ఓటర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఇది నిజమైన ఓటర్లను తొలగించే టెక్నిక్ అంటూ విమర్శించారు. బీహార్‌లో చేసిన దాన్ని ఇతర రాష్ట్రాల్లో చేయాలని చూస్తున్నారని స్టాలిన్ అన్నారు. ఈ చర్యను రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ వ్యతిరేకించారని, దీనిని వ్యతిరేకించడానికి అఖిల పక్షం ఏర్పాటు చేసి ఈసీ ఆదేశాన్ని ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించిందని స్టాలిన్ అన్నారు.