Bengaluru: భార్యకు అనస్థీషియా ఇచ్చి చంపిన డాక్టర్..వైద్య వృత్తికే మాయని మచ్చ

బెంగళూరులో ఘటన

Update: 2025-10-16 05:15 GMT

సమాజంలో చోటు చేసుకుంటున్న కొన్ని నేరాలు చూస్తే.. మనుషులు మరీ ఇంత మానవత్వం లేకుండా, రాక్షసులుగా ఎలా ప్రవర్తించగలరు.. కాస్త కూడా జాలి, దయ అనేవి ఉండవా అనిపించక మానదు. తాజాగా పోలీసులు చేధించిన ఓ హత్య కేసు వివరాలు చూస్తే.. ఇంత చిన్న కారణానికే బంగారం లాంటి భార్యను చంపడానికి చేతులెలా వచ్చాయి అనిపిస్తుంది. భార్య అనారోగ్య సమస్యల గురించి దాచి పెళ్లి చేశారనే కోపంతో ఓ వైద్యుడు దారుణానికి ఒడిగట్టాడు. చికిత్స పేరుతో భార్యను హత్య చేసి.. సహజ మరణంగా చిత్రీకరించాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆరు నెలల తర్వాత పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. ఆ వివరాలు..

ఆరు నెలల క్రితం బెంగళూరులో చోటు చేసుకున్న డాక్టర్ కృతికా రెడ్డి హత్య కేసు మిస్టరీ తాజాగా వీడింది. ఈ కేసులో పోలీసులు.. ఆమె భర్త, జనరల్ సర్జన్ డాక్టర్ మహేంద్ర రెడ్డిని అరెస్ట్ చేశారు. అతడు.. మత్తు మందు ఓవర్ డోస్ ఇచ్చి కృతికను హత్య చేశాడు. కేవలం ఆపరేషన్ థియేటర్లలో మాత్రమే వినియోగించే.. ప్రొపోఫోల్ అనే మత్తు మందును వినియోగించి భార్యను హత్య చేశాడు మహేందర్ రెడ్డి. కృతికది సహజ మరణంగా ఆమె కుటుంబ సభ్యులని నమ్మించిన నిందితుడు.. ఈ సంఘటన తర్వాత తన మకాంను మణిపాల్‌కు మార్చాడు. బుధవారం నాడు పోలీసులు అతడిని మణిపాల్‌లో అరెస్ట్ చేశారు.

బెంగళూరు లోని మారతహళ్లి ఠాణా పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహేంద్ర రెడ్డి, కృతికా రెడ్డి ఇద్దరూ వైద్యులే. వీరు బెంగళూరు విక్టోరియా ఆసుపత్రిలో పని చేసేవారు. కృతికా రెడ్డి డెర్మటాలజిస్ట్.. కాగా మహేందర్ రెడ్డి జనరల్‌ సర్జన్‌. ఇద్దరూ వైద్యులు కావడం మాత్రమే కాక ఒకే ఆస్పత్రిలో పని చేస్తుండటంతో.. వారి తల్లిదండ్రులు ఇద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈక్రమంలో 2024 మే 26వ తేదీన కృతిక, మహేందర్ రెడ్డిల వివాహం జరిగింది. అయితే పెళ్లై సంవత్సరం కూడా కాకముందే.. కృతికా రెడ్డి హత్యకు గురి కావడం సంచలనం రేపింది.

కృతికా రెడ్డికి అజీర్ణం, షుగర్, గ్యాస్ట్రిక్ వంటి అనారోగ్య సమస్యలున్నాయి. పెళ్లైన తర్వాత దీని గురించి మహేందర్ రెడ్డికి తెలిసింది. కృతికకు ఉన్న అనారోగ్య సమస్యల గురించి తన వద్ద దాచి.. ఆమెని తనకిచ్చి పెళ్లి చేసినందుకు తీవ్రంగా రగిలిపోయిన మహేందర్ రెడ్డి.. ఏకంగా భార్యను హత్య చేయాలని భావించాడు. ఇందుకోసం తన వైద్య వృత్తినే వినియోగించుకోవాలనుకున్నాడు. ఇదిలా ఉండాగానే అనారోగ్యం కారణంగా కృతికా మారతహళ్లిలోని తన తల్లిదండ్రులకు వద్దకు వెళ్లింది.

దీంతో మహేంద్ర రెడ్డి ఆమెను పరామర్శించడానికి మారతహళ్లికి వెళ్లాడు. అక్కడే ఉంటూ కృతికా రెడ్డికి తనే స్వయంగా ట్రీట్‌మెంట్ ఇచ్చాడు. దీనిలో భాగంగా ఆపరేషన్ థియేటర్లలో మాత్రమే వినియోగించే.. ప్రొపోఫోల్ అనే మత్తు మందును ఓవర్ డోస్ ఇచ్చాడు. ఈక్రమంలో ఈఏడాది అనగా 2025, ఏప్రిల్ 23న కృతిక ఆరోగ్యం విషయమించింది. శ్వాస తీసుకోలేని స్థితికి చేరింది. దీంతో ఆమెని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కృతిక చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.

అయితే మొదట్లో కృతికది సహజ మరణంగా భావించారు. అనారోగ్య కారణాల వల్లే ఆమె చనిపోయి ఉంటుందని పోలీసులు కూడా నమ్మారు. ఈక్రమంలో అన్నేచురల్ డెత్ రిపోర్ట్‌గా కేసు నమోదు చేశారు. విషయం సద్దుమణిగింది అనుకున్న తర్వాత మహేదర్ రెడ్డి మణిపాల్ వెళ్లి అక్కడే క్లినిక్ తెరిచాడు. అయితే కృతిక మృతి మీద ఆమె అక్క, రేడియాలజిస్ట్ అయిన డాక్టర్ నిఖితా రెడ్డికి అనుమానం వచ్చింది. సమగ్ర విచారణకు పట్టుబట్టడంతో.. ఆరు నెలల తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదిక వెలుగులోకి వచ్చింది. కృతిక శరీరంలో అనేక అవయవాల్లో ప్రొపోఫోల్ ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ రిపోర్ట్ లో తేలింది. దీని కారణంగానే ఆమె మరణించిందని స్పష్టంగా తేలింది. దీంతో మారతహళ్లి పోలీసులు.. మణిపాల్ వెళ్లి మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారించారు. ఈక్రమంలో తానే కృతికకు అనస్తీషియా ఓవర్‌ డోస్‌ ఇచ్చి హత్య చేసినట్లు అతడు తన నేరాన్ని అంగీకరించాడు.

Tags:    

Similar News