Evm : ఈవీఎం డాటా తొలగించొద్దు! ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు

ట్యాంపరింగ్‌ ఆరోపణలొస్తే.. ఇంజినీర్‌తో చెక్‌ చేయించాల్సిందే;

Update: 2025-02-11 23:42 GMT

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌ లలో పోలింగ్‌కు సంబంధించిన సమాచారం , ఎన్నికల గుర్తుల లోడింగ్‌ యూనిట్లలో సమాచారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు  కీలక ఆదేశాలు జారీచేసింది. ఎన్నికలు పూర్తయ్యాక ఓడిన అభ్యర్థి అభ్యర్థన మేరకు ఈవీఎంల వెరిఫికేషన్‌లో భాగంగా ఆయా ఈవీఎంలలోని డేటాను చెరిపేయడం, రీలోడ్‌ చేసే సంస్కృతిని మానుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాల ధర్మాసనం ఈసీకి సూచించింది. సింబల్‌ లోడింగ్‌ యూనిట్‌(ఎస్‌ఎల్‌యూ)ను తనిఖీ చేయాల్సి ఉందని పేర్కొంది. ఈవీఎంలలో మెమొరీని, ఎస్‌ఎల్‌యూలను తనిఖీచేసేందుకు అవకాశం ఇవ్వాలని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) అనే ఎన్‌జీవో సంస్థ, ఓడిన అభ్యర్థి సర్వ్‌ మిట్టెర్‌ వేసిన పిటిషన్‌ను మంగళవారం విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు పై విధంగా ఆదేశాలిచ్చింది. 


ఓట్ల లెక్కింపు పూర్తైన తర్వాత కూడా ఈవీఎంలలో డాటాను తొలగించకూడదని, ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురికాలేదని నిరూపించడానికి ఈవీఎంలలోని మైక్రో కంట్రోలర్‌, బర్న్‌ మెమొరీని ఇంజినీర్ల బృందం చేత తనిఖీ చేయించాలని కోరుతూ ఏడీఆర్‌, కొందరు హర్యానా నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు గత ఏడాది ఏప్రిల్‌లో ఇచ్చిన ఆదేశాలను ఈసీ పాటించాలని పిటిషన్‌లో కోరారు.

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

  • ఓట్ల లెక్కింపు పూర్తైన తర్వాత కూడా ఈవీఎంలలో డాటాను తొలగించకూడదు. కొత్తగా ఏ సమాచారాన్ని జోడించకూడదు.
  • ఈవీఎం ట్యాంపరింగ్‌ జరిగినట్టు ఎన్నికల్లో ఓటమిపాలైన అభ్యర్థి ఎవరైనా ఆరోపిస్తే ఇంజినీర్ల బృందం చెక్‌ చేయాల్సిందే.
  • ట్యాంపరింగ్‌ ఆరోపణలు చేసిన అభ్యర్థి సమక్షంలో ఈవీఎంలను తయారు చేసిన సంస్థలు) చెందిన ఇంజినీర్లు ఈ తనిఖీలు చేపట్టాలి.
  • ఆరోపించిన అభ్యర్థికి ఈవీఎం ట్యాంపరింగ్‌ జరుగలేదని నిరూపించాలి. అంతేగానీ, తనిఖీల పేరిట పూర్తి డాటాను డిలీట్‌ చేయడం ఎందుకు?
  • అందుకనే.. తనిఖీల్లో భాగంగా ఈవీఎంలలోని అసలు డాటాను వెలికితీయడానికి ముందు ఆ డాటాను డమ్మీ ఈవీఎంలలో నిక్షిప్తం చేయాలి. ఆ తర్వాత ఇంజినీర్ల బృందం మైక్రో కంట్రోలర్‌, ఈవీఎంలలో బర్న్‌ చేసిన మెమొరీని తనిఖీ చేయాలి.
  • ఈవీఎంలను వెరిఫై చేయాలనుకొనే వారు రూ. 40 వేలను ఫీజుగా చెల్లించాల్సి ఉన్నది. ఇది చాలా ఎక్కువ. ఈ ఫీజును తగ్గించాలి.

రూ.40 వేల ఫీజును తగ్గించండి

ఓడిన అభ్యర్థి ఒకవేళ ఈవీఎంలను తనిఖీ కోసం అభ్యర్థిస్తే అందుకోసం ఆయనపై వేసే ఫీజు భారాన్ని తగ్గించాలని కోర్టు సూచించింది. ఎన్నికల ఫలితాలొచ్చాక 45 రోజులపాటు సింబల్‌ లోడింగ్‌ యూనిట్లను, ఈవీఎంలతోపాటే స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరచాలి. ‘‘అభ్యర్థి వచ్చి అడిగితే ఇంజనీర్‌తో ఈవీఎంలను వెరిఫై చేయించాలి. ఇందుకు ఏకంగా రూ.40,000 ఖర్చు అవుతుందా?. అంత ఫీజును అభ్యర్థిపై వేస్తారా?. ఇది చాలా ఎక్కువ మొత్తం. దీనిని తగ్గించండి’’ అని ఈసీ తరఫున హాజరైన న్యాయవాది మణీందర్‌ సింగ్‌ను ధర్మాసనం కోరింది. ‘‘ ఈవీఎంల వెరిఫికేషన్‌ పద్దతి అనేది కోర్టు ఆదేశాలకు అనుగుణంగా లేదు. ఈవీఎం సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లో ఏదైనా మతలబు ఉందో లేదో తెల్సుకునే స్వేచ్ఛ ఉండాలి’’ అని ఏడీఆర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదించారు.

Tags:    

Similar News