POCSO LAW: లైంగిక సమ్మతి వయస్సు తగ్గించొద్దు

18 ఏళ్లే కొనసాగించాలి... కేంద్రానికి లా కమిషన్‌ కీలక సూచనలు;

Update: 2023-09-30 02:00 GMT

పోక్సో చట్టం ప్రకారం ఇద్దరు వ్యక్తుల మధ్య లైంగిక సంబంధం విషయంలో సమ్మతి వయసుపై లా కమిషన్ కీలక సూచనలు చేసింది. లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి అంగీకారం తెలిపే కనీస వయసును 18ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలనే వాదనను వ్యతిరేకించింది. ఇద్దరు వ్యక్తుల మధ్య లైంగిక సంబంధం విషయంలో సమ్మతి తెలిపే వయసు 18 ఏళ్లేనని, దాన్ని మార్చడం సరికాదని సూచించింది. లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి అంగీకారం తెలిపే కనీస వయసు 18సంవత్సరాల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలనే వాదనను వ్యతిరేకించింది.


పోక్సో చట్టంప్రకారం ప్రస్తుతమున్న సమ్మతి వయసును మార్చడం అంత మంచిది కాదంటూ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో లా కమిషన్‌ పేర్కొంది. లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే పోక్సో చట్టం ప్రకారం 18ఏళ్లు నిండని బాలబాలికలతో లైంగిక కార్యకలాపాలు జరపడం తీవ్రనేరంగా పరిగణిస్తారు. వారి అంగీకారంతో చేసినా అది చట్టవిరుద్ధమే అవుతుంది. అయితే, కొన్ని సందర్భాల్లో ఈ చట్టం ద్వారా యుక్త వయసులో ఉన్నవారి మధ్య సంబంధాన్ని నిర్వచించే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే బాలబాలికలు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి అంగీకారం తెలిపే కనీస వయసు 18నుంచి 16ఏళ్లకు తగ్గించాలని పలు కోర్టులు సూచించాయి. ఈ క్రమంలో సమ్మతి వయసు 16ఏళ్లకు మార్చడం సరికాదని లా కమిషన్‌ పేర్కొంది. ఒకవేళ సమ్మతి వయసు తగ్గిస్తే బాల్యవివాహాలు, పిల్లల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని లా కమిషన్‌ తన నివేదికలో తెలిపింది.

అయితే 16-18 ఏళ్ల పిల్లలకు సంబంధించిన ఇలాంటి కేసుల్లో వారు ఇష్టపూర్వకంగా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటే వాటి పరిష్కారానికి చట్టంలో కొన్ని సవరణలు అవసరమని లా కమిషన్‌ అభిప్రాయపడింది. ఆ కేసుల్లో శిక్షలు విధించేటప్పుడు కోర్టులు విచక్షణ మేరకు నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. 16-18ఏళ్ల పిల్లలకు సంబంధించిన కేసుల్లో వారు సమ్మతి తెలియజేస్తే అది కౌమార దశలోని అనియంత్రిత ప్రేమనా? లేదా క్రిమినల్‌ ఉద్దేశాలు ఉన్నాయా అని గుర్తించడంపై కోర్టులు అప్రమత్తంగా వ్యవహరించాలని లాకమిషన్‌ పేర్కొంది.


దేశవ్యాప్తంగా ఈ-ఎఫ్‌ఐఆర్‌ నమోదును దశలవారీగా అమల్లోకి తీసుకురావాలని....లా కమిషన్‌ కేంద్రానికి సిఫారసు చేసింది. తొలిదశలో మూడేళ్లవరకు శిక్షపడే నేరాలకు సంబంధించిన కేసుల్లో ఈ విధానాన్ని అమల్లోకి తేవాలని సూచించింది. ఈ-ఎఫ్‌ఐఆర్‌ల నమోదు కోసం కేంద్రీకృత జాతీయ పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.

Tags:    

Similar News