Draupadi Murmu: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ద్రౌపది ముర్ము ఫోన్..
Draupadi Murmu: రాష్ట్రపతి ఎన్నికలకు దగ్గర పడుతుండటంతో ఎన్డీయే, విపక్ష కూటమి అభ్యర్థులిద్దరూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.;
Draupadi Murmu: రాష్ట్రపతి ఎన్నికలకు దగ్గర పడుతుండటంతో ఎన్డీయే, విపక్ష కూటమి అభ్యర్థులిద్దరూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసిన ద్రౌపది ముర్ము ప్రచారంలో ముందున్నారు.. విపక్ష నేతలను కలిసి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతోపాటు రాహుల్, అలాగే ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌కు ఫోన్ చేశారు.
రాష్ట్రపతి అభ్యర్థిగా తనకు మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు.. అటు నిన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీకి ఫోన్ చేసి మద్దతు కోరారు ద్రౌపది ముర్ము. మరోవైపు రాష్ట్రాల పర్యటనలకు కూడా ముర్ము శ్రీకారం చుట్టనున్నారు.. అన్ని రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అటు ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వానికి బీఎస్పీ మద్దతు ప్రకటించింది.. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత్రి మాయావతి వెల్లడించారు..
అయితే, బీజేపీకి మద్దతుగానో లేక ప్రతిపక్ష కూటమికి వ్యతిరేకంగానో తాము ఈ నిర్ణయం తీసుకోలేదన్నారు.. తమ పార్టీ సిద్ధాంతాలను, తమ ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకునే గిరిజన తెగకు చెందిన అభ్యర్థికి మద్దతివ్వాలని నిర్ణయించామన్నారు. సమర్థత, అంకితభావం కలిగిన ఆదివాసీ మహిళను రాష్ట్రపతి చేయడమే తమ ఉద్దేశమని చెప్పారు.. అదే సమయంలో విపక్షాల అభ్యర్థిని ఎంపిక చేసే ముందు తనను సంప్రదించలేదని తన అసహనాన్ని వ్యక్తపరిచారు.
ద్రౌపది ముర్ముకు 60 శాతానికిపైగా ఓట్లు వస్తాయని ఎన్డీయే కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. ఎన్డీయే మిత్రపక్షాలతోపాటు బయటి నుంచి బీజేడీ, వైసీపీ, ఇతర పార్టీలు మద్దతిస్తున్న నేపథ్యంలో మైలురాయిని దాటడం ఖాయమనే మాట ఆ కూటమి వర్గాల్లో వినిపిస్తోంది.. అంతేకాదు, దేశంలోనే తొలిసారి గిరిజన మహిళను అత్యున్నత రాష్ట్రపతి పదవికి పోటీకి నిలబెట్టిన నేపథ్యంలో విభిన్న పార్టీల్లోని బలహీనవర్గాల ఎంపీలూ ఆమెకు మద్దతిచ్చే అవకాశం ఉందని బీజేపీ వర్గాలంటున్నాయి.