India-Pak Tensions: బుద్ధిని చూపించిన పాకిస్తాన్‌..!

రాజస్థాన్‌లో తొమ్మిది జిల్లాల్లో బ్లాక్‌అవుట్‌ అమలు..!;

Update: 2025-05-11 03:00 GMT

కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించిన కొద్దిగంటల్లోనే దాయాది దేశం మరోసారి తన బుద్ధిని చూపించింది. ఈ క్రమంలో శనివారం రాత్రి రాజస్థాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగాయి. జైసల్మేర్‌లో పలుచోట్ల పేలుడు శబ్దాలు వినిపించాయి. బార్మర్, శ్రీగంగానగర్‌లలో పాకిస్తాన్ డ్రోన్లతో దాడులకు ప్రయత్నించగా.. భారత సైన్యం వాటిని కూల్చివేసింది. దాంతో ఎలాంటి నష్టం జరుగలేదని అధికారులు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం బార్మర్‌, శ్రీగంగానగర్‌, బికనీర్‌, జైసల్మేర్‌ అంతటా ప్రశాంతత నెలకొందని పేర్కొన్నారు. శనివారం రాత్రి 11.37 గంటల ప్రాంతంలో జైసల్మేర్ పశ్చిమ వైపు నుంచి ఆరు పెద్ద పేలుళ్లు వినిపించాయి. దాంతో జనం భయాందోళనకు గురయ్యారు. అంతకు ముందు కాల్పుల విరమణ ప్రకటన తర్వాత బార్మర్‌, జైసల్మేర్‌, జోధ్‌పూర్‌, ఫలోడి, బికనీర్‌, గంగానగర్‌, హనుమాగఢ్‌లో మార్కెట్లు తిరిగి తెరిచారు.

రాత్రి వరకు మళ్లీ పాకిస్తాన్‌ దాడులకు ప్రయత్నించగా అధికారులు ముందు జాగ్రత్తగా పాలి, బలోత్రాతో సహా తొమ్మిది జిల్లాల్లో మళ్లీ బ్లాక్‌అవుట్‌ అమలు చేశారు. బార్మెర్‌లో కలెక్టర్ టీనా దాబీ శనివారం రాత్రి హెచ్చరికలు చేశారు. ప్రజలు అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని అధికార యంత్రాంగం కోరింది. సోషల్ మీడియా ద్వారా ప్రకటన వెలువడిన నిమిషాల్లోనే, స్థానిక మార్కెట్లు మూతపడ్డాయి, ప్రజలు ఇండ్లకు వెళ్లిపోగా.. వీధులు ఖాళీ అయ్యాయి. జైసల్మేర్‌లో శనివారం రాత్రి ఆలస్యంగా పేలుడు శబ్దాలు వినిపించినప్పటికీ.. ఎలాంటి నష్టం జరుగలేదని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ప్రభావిత జిల్లాల్లో పరిస్థితి ప్రశాంతంగా, నియంత్రణలో ఉందని అధికారులు తెలిపారు. అయినా, భద్రతా దళాలు హై అలర్ట్‌లో ఉన్నాయి. స్థానిక పరిపాలన సరిహద్దులో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నది.

Tags:    

Similar News