Bengal Rape Case: వైద్య విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరగలేదు..కానీ
బెంగాల్ కేసులో పోలీసుల ట్విస్ట్..
పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో మెడికల్ విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన సంచలనంగా మారింది. ఒడిశా జలేశ్వర్‌కు చెందిన 23 ఏళ్ల యువతి, దుర్గాపూర్‌లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుతోంది. అక్టోబర్ 10న యువతి తన స్నేహితుడి కోసం బయటకు వచ్చిన సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది.
అయితే, ఈ కేసులో విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగిన విషయాన్ని బెంగాల్ పోలీసులు కొట్టిపారేశారు. ఒకే వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పారు. అసన్సోల్-దుర్గాపూర్ పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్ చౌదరి, బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం మరియు భౌతిక ఆధారాల ఆధారంగా లైంగిక దాడిలో ఒకే వ్యక్తి పాల్గొన్నాడని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడి దుస్తులు సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామని చెప్పారు.
ఈ కేసు విచారణలో, బాధితురాలి స్నేహితుడి ప్రమేయం ఉందా? అనే విషయాన్ని కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు, అతడి పాత్రపై సందేహాలు ఉన్నాయని చెప్పారు. అతడిని కూడా ప్రశ్నిస్తున్నట్లు వెల్లడించారు. ఘటన రీకన్‌స్ట్రక్ట్ చేయడానికి నిందితులతో కలిసి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. బాధితురాలు, తన బాయ్‌ఫ్రెండ్ తో రాత్రి డిన్నర్ వెళ్లిన సమయంలో ఆమెపై అఘాయిత్యం జరిగింది.