EC Survey: బిహార్ ఎన్నికలకు ముందు బిగ్ ట్విస్ట్
బీహార్ ఓటర్ లిస్టులో బంగ్లా, నేపాల్, బర్మా దేశస్తులు..!;
బీహార్ రాష్ట్రం లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఆ రాష్ట్ర ఓటర్ల జాబితాను సవరిస్తోంది. ఈ సవరణ జూన్ 24 ప్రారంభమైంది. అయితే ఈ సవరణపై ప్రతిపక్ష మహాకూటమి తీవ్ర విమర్శలు చేస్తోంది. మహా కూటమికి అనుకూలంగా ఉండే నిరుపేద ఓటర్లను జాబితాను తొలగించేందుకే ఈసీ ఓటర్ల జాబితాను సవరిస్తోందని ఆరోపిస్తోంది.
అయితే ఇప్పటివరక జరిగిన సర్వే ప్రకారం.. బీహార్ ఓటర్ల జాబితాలో అనేక మంది బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ దేశస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఈసీ వర్గాలు తెలిపినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మీడియా కథనాల ప్రకారం.. బంగ్లా, నేపాల్, మయన్మార్ దేశాలకు చెందిన అనేక మంది ప్రస్తుతం రాష్ట్రంలో నివాసముంటున్నారని సర్వేలో తేలింది.
వారంతా ఆధార్ కార్డులు, నివాస ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డులు లాంటి వాటిని అక్రమ మార్గాల ద్వారా పొందినట్లు సమాచారం. సర్వే చేస్తున్న క్షేత్రస్థాయి అధికారులు ఇలాంటి వారిని అనేక మందిని గుర్తించినట్లు తెలుస్తోంది. అక్రమ ఓటర్ల పేర్లను ఆగస్టు 1 నుంచి 30 వరకు గుర్తించి జాబితా నుంచి తొలగించనున్నట్లు ఈసీ వర్గాలు తెలిపాయి. అనర్హులు, నకిలీ ఓటర్లతోపాటు విదేశీయులను ఓటర్ల జాబితా నుంచి తొలగించేడమే లక్ష్యంగా ఈ సర్వే ప్రారంభించినట్లు ఈసీ చెబుతోంది.
కాగా ఇలాంటి సర్వేను చివరిసారిగా 20 ఏళ్ల క్రితం చేశారు. అప్పటి నుంచి అనుబంధ సవరణలు మాత్రమే చేపడుతున్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలలు ముందు ఈసీ ఈ ప్రక్రియను చేపట్టడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఓటర్ల జాబితా సవరణపై అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఈసీ చర్యను కోర్టు సమర్థించింది. రాజ్యాంగంబద్దమైన ప్రక్రియగా పేర్కొంది. అయితే, ఈసీ ఎంచుకున్న టైమ్ పీరియడ్‌ను మాత్రం కోర్టు ప్రశ్నించింది.