Arvind Kejriwal: కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి నివాసంలో ఈడీ తనిఖీలు
మనీలాండరింగ్ కేసులో పట్టుబిగుస్తున్న ఈడీ;
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వద్ద పనిచేస్తున్న వ్యక్తిగత కార్యదర్శి నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేస్తోంది. సుమారు 10 ప్రదేశాల్లో ఆ తనిఖీలు జరుగుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీతో లింకు ఉన్న ప్రదేశాల్లోనూ నేడు సోదాలు జరుగుతున్నాయి. మనీల్యాండరింగ్ కేసులో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. పర్సనల్ సెక్రటరీ బిబవ్ కుమార్‌తో పాటు ఢిల్లీ జల బోర్డు సభ్యుడు శాలాబ్ కుమార్ ఇండ్లల్లోనూ ఈడీ ఆఫీసర్లు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనే 10 ప్రదేశాల్లో తనిఖీలు చేపడుతున్నారు.
సోదాలు జరుపుతున్న ప్రాంగణాల్లో కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్, ఢిల్లీ జల్‌బోర్డ్ (డీజేబీ) మాజీ సభ్యుడు షలభ్ కుమార్‌తో మరికొందరి ప్రాంగణాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే, ఆప్ ట్రెజరర్, రాజ్యసభ సభ్యుడు ఎన్‌డీ గుప్తా ఇంట్లోనూ సోదాలు జరుపుతోంది. మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లను ఐదోసారీ కేజ్రీవాల్ విస్మరించిన తర్వాత ఈ దాడులు జరగడం గమనార్హం.
మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేషనల్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ బిజెపిపై సంచలన ఆరోపణలు చేశారు. నిన్న మొన్నటి వరకు తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతోందని, రూ.25 కోట్లు ఆశచూపుతూ బిజెపిలో చేరాలని రాయబారాలు చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై బిజెపి ఢిల్లీ ఛీప్ వీరేంద్ర సచ్ దేవా పోలీసులకు ఫిర్యాదు చేయడం, వివరణ కోరుతూ పోలీసులు కేజ్రీవాల్ కు నోటీసులు పంపడమూ జరిగింది. తాజాగా ఆదివారం ఓ సభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. పార్టీ ఎమ్మెల్యేలనే కాదు తనను కూడా బిజెపిలో చేరాలని అడిగారని వెల్లడించారు. బీజేపీ కండువా కప్పుకుంటే వేధింపులు ఆపేస్తామని, కేసులు మాఫీ చేస్తామని చెప్పారని అన్నారు.
బిజెపి తీర్థం పుచ్చుకుంటే చాలు అప్పటి వరకూ చేసిన తప్పులన్నీ మాఫీ అయిపోతాయంటూ ఎద్దేవా చేశారు. అయితే, తప్పు చేసిన వాళ్లు భయపడి చేరుతారేమో కానీ ఏ తప్పూ చేయని మేమెందుకు బిజెపిలో చేరుతామని కేజ్రీవాల్ ప్రశ్నించారు. తప్పు చేయనంతకాలం ఎవరికీ తలవంచబోనని బిజెపికి తెగేసి చెప్పానని వివరించారు. తాను, తన ప్రభుత్వం ఢిల్లీ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నామని చెప్పారు. స్కూళ్లు, ఆసుపత్రులు, రోడ్లు నిర్మించడంలో తప్పేముందని నిలదీశారు.