Rahul Gandhi: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో రాహుల్ మూడో రోజు విచారణ.. తొమ్మిది గంటలపాటు..

Rahul Gandhi: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో AICC ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని.. ఈడీ సుధీర్ఘంగా విచారిస్తోంది.

Update: 2022-06-15 16:15 GMT

Rahul Gandhi: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో AICC ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని.. ఈడీ సుధీర్ఘంగా విచారిస్తోంది. మూడోరోజు ఉదయం పదకొండు గంటలకే ఢిల్లీ ఈడీ కార్యాలయానికి చేరుకున్న రాహుల్‌ను.. లంచ్‌ బ్రెక్‌ వరకు సుమారు మూడు గంటలపాటు విచారించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు భోజన విరామంలో.. తన నివాసానికి వెళ్లి వచ్చిన రాహుల్‌.. తిరిగి ఈడీ ఎదుట హాజరయ్యారు.

ఉదయం నుంచి సుమారు తొమ్మిదిగంటలుగా రాహుల్‌ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. అటు మనీలాండరింగ్‌ కేసులో ఆర్ధిక, బ్యాంకు లావాదేవీలపైనే ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అటు రాహుల్ స్టేట్మెంట్‌ను ఈడీ నమోదు చేస్తున్నట్లు సమాచారం. అయితే రాహుల్ పదేపదే తన వాంగ్మూలాన్ని మార్చుకోవడంతో విచారణ ఆలస్యమైందని సదరు వర్గాలు పేర్కొన్నాయి.

ఈడీ విచారణ సమయంలో మినహా ప్రియాంక గాంధీ.. రాహుల్ వెంటే ఉంటున్నారు. మరోవైపు మూడోరోజు ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో కాంగ్రెస్‌ యుద్ధం ప్రకటించింది. ఉదయం కాంగ్రెస్ సెంట్రల్‌ ఆఫీస్‌లో నిరసన చేపట్టిన నేతలను, శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. జరిగింది. తమ కార్యకర్తలు, నేతల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ మండిపడ్డారు.

కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీతో ఈ విధంగా ప్రవర్తించలేదన్న ఆయన..ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఓ రాజకీయ పార్టీకి నిరసన తెలిపే హక్కు ఉంటుందని.. నిరసనను అణచివేయడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని వ్యాఖ్యానించారు. 'మేమేమైనా ఉగ్రవాదులమా?' అంటూ శశిథరూర్‌ ప్రశ్నించారు.

అటు పోలీసుల తీరును నిరసిస్తూ రేపు అన్ని రాష్ట్రాల రాజ్ భ‌వ‌న్‌ల‌ను ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. నిరసనకు శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆదేశించింది. అటు రాహుల్‌పై ఈడీ విచారణ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడిక్కడ భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈడీ కార్యాలయం సహా రాహుల్‌ నివాసం, ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద భద్రతాబలగాలు మోహరించాయి. ఈడీ ఆఫీస్‌ చుట్టూ 144 సెక్షన్‌ విధించారు.

Tags:    

Similar News