Saurabh Bhardwaj: ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఇంటిపై ఈడీ దాడులు
ఆస్పత్రి నిర్మాణ కుంభకోణం కేసులో దర్యాప్తు;
దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ నేత, మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఇంటిపై ఈడీ దాడులు చేస్తోంది. ఆస్పత్రి నిర్మాణ కుంభకోణంలో సౌరభ్ భరద్వాజ్ నివాసం, మరో 12 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేస్తున్నారు. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో 13 చోట్ల దాడులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
సౌరభ్ భరద్వాజ్.. ఢిల్లీ అసెంబ్లీలో గ్రేటర్ కైలాష్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. కేజ్రీవాల్ మంత్రివర్గంలో ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, నీరు వంటి కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. ఢిల్లీ జల్ బోర్డు ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారిక ప్రతినిధుల్లో ఒకరుగా ఉన్నారు. అయితే ఏం స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు అధికారులు ఇంకా వెల్లడించలేదు.
ఈ ఏడాది జూన్‌లో ఆస్పత్రి ప్రాజెక్ట్ జాప్యానికి సంబంధించిన కుంభకోణంలో మాజీ మంత్రులు సౌరభ్ భరద్వాజ్, సత్యేంద్ర జైన్‌లపై అవినీతి నిరోధక చట్టం కింద ఏసీబీ దర్యాప్తునకు కేంద్ర హోంమంత్రి శాఖ అనుమతి మంజూరు చేసింది. గత ఏడాది ఆగస్టులో బీజేపీ చెందిన విజేందర్ గుప్తా చేసిన ఫిర్యాదు మేరకు ఈ విచారణకు ఆదేశించింది. అప్పటి మంత్రులు భరద్వాజ్, జైన్‌ల సహకారంతో ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య శాఖలో అవినీతి జరిగిందని గుప్తా ఆరోపించారు. వేల కోట్లకు పైగా జరిగిన ఆస్పత్రుల కుంభకోణంలో ఢిల్లీ మాజీ ఆరోగ్య మంత్రులపై అవినీతి నిరోధక చట్టం, 1988లోని సెక్షన్ 17A కింద అవినీతి నిరోధక శాఖ (ACB) విచారణ/దర్యాప్తు నిర్వహించడానికి ఆమోదం తెలిపింది. మే 6న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా దీనికి సిఫార్సు చేసిన తర్వాత ఆమోదం పొందిందని అధికారి తెలిపారు.