బిహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హాకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. రెండు వేర్వేరు నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదయ్యారని ఆరోపణలు రావడంతో ఈ నోటీసులు ఇచ్చింది.విజయ్ కుమార్ సిన్హా పేరు లఖీసరాయ్, బంకీపూర్ అనే రెండు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటరు జాబితాలో నమోదై ఉంది. ప్రతిపక్ష పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నాయకుడు తేజస్వి యాదవ్ ఈ విషయాన్ని బహిర్గతం చేశారు.ఈ ఆరోపణల నేపథ్యంలో బంకీపూర్ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి (ERO) విజయ్ కుమార్ సిన్హాకు నోటీసులు పంపారు. ఆగస్టు 14 సాయంత్రం 5 గంటలలోగా ఈ విషయంపై వివరణ ఇవ్వాలని కోరారు. ఈ ఆరోపణలను విజయ్ సిన్హా ఖండించారు. తాను గతంలో బంకీపూర్ నియోజకవర్గంలో నివాసం ఉండేవాడినని, అయితే 2024 ఏప్రిల్‌లో తన పేరును ఆ జాబితా నుంచి తొలగించాలని దరఖాస్తు చేసుకున్నానని తెలిపారు. కానీ అది ఎందుకు తొలగించబడలేదో తనకు తెలియదని చెప్పారు. తాను కేవలం లఖీసరాయ్ నుంచే ఓటు వేశానని స్పష్టం చేశారు. ఈ అంశంపై బిహార్ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి ఒకేసారి రెండు చోట్ల ఓటరుగా నమోదు కావడం చట్టవిరుద్ధం.