Elon Musk: వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై మళ్లీ ట్రంప్-మస్క్ మధ్య రగడ
ట్రంప్‌కు ఎలాన్ మస్క్ భారీ షాక్..;
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య మరోసారి విభేదాలు తీవ్రం అవుతున్నాయి. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై మరోసారి మస్క్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. జనాదరణ లేని ప్యాకేజీకి మద్దతు ఇచ్చే చట్టసభ సభ్యులను తొలగిస్తానని వార్నింగ్ ఇచ్చారు. ‘‘ప్రభుత్వ ఖర్చులను తగ్గించడంపై ప్రచారం చేసి.. వెంటనే చరిత్రలో అతిపెద్ద రుణ పెరుగుదలకు ఓటు వేసిన ప్రతి కాంగ్రెస్ సభ్యుడు సిగ్గుతో తల దించుకోవాలి!’’ అని ఎక్స్‌లో మస్క్ పోస్ట్ చేశారు. అంతేకాకుండా ‘‘నేను ఈ భూమిపై చేసే చివరి పని అదే అయితే వారు వచ్చే ఏడాది తమ ప్రాథమిక పరీక్షను కోల్పోతారు.’’ అని తీవ్ర హెచ్చరిక చేశారు.
ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటీఫుల్‌ను మొదటి నుంచి మస్క్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మస్క్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో ట్రంప్-మస్క్ మధ్య ఘర్షణ మొదలైనట్లుగా వార్తలు వినిపించాయి. కొద్ది రోజుల తర్వాత పోస్టులపై క్షమాపణ చెబుతూ మస్క్ పోస్ట్ చేశారు. దీంతో ఇద్దరి మధ్య రాజీ కుదిరిందని భావించారు. తాజాగా మరోసారి మస్క్ విమర్శలు గుప్పించడంతో వివాదం అలానే ఉందని అర్థమవుతోంది.
ఇక సెనెట్‌లో బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం పొందింది. ఉత్కంఠగా సాగిన ఓటింగ్‌లో 51-49 తేడాతో బిల్లు ఆమోదం లభించింది. బిల్లుకు ఆమోదం లభించడంపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఇది గొప్ప విజయమని సోషల్ మీడియాలో ట్రంప్ అభివర్ణించారు. రిపబ్లికన్లు లేకపోతే ఇది సాధ్యం కాదని చెప్పారు. వారు నిజంగా దేశాన్ని ప్రేమించే వ్యక్తులని, అమెరికా అధ్యక్షుడిగా తనకు ఇప్పుడు గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం యూఎస్ సెనేట్‌లో ఈ బిల్లుపై మారథాన్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యేలోపు బిల్లును ఆమోదింపజేసి అధ్యక్షుడి కార్యాలయానికి పంపాలని రిపబ్లికన్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. సెనేట్‌లో రిపబ్లికన్లకు స్వల్ప మెజారిటీ ఉన్నందున, పార్టీపై ట్రంప్‌కు ఉన్న బలమైన పట్టు కారణంగా బిల్లుకు ఆమోదం లభించవచ్చని భావిస్తున్నారు.
అయితే, సెనేట్‌లో గట్టెక్కినా ప్రతినిధుల సభలో దీనికి మరో గండం పొంచి ఉంది. అక్కడ కూడా రిపబ్లికన్లకు స్వల్ప మెజారిటీనే ఉన్నప్పటికీ పలువురు సభ్యులు దీనిని వ్యతిరేకిస్తామని ఇప్పటికే సంకేతాలిచ్చారు. ఈ బిల్లు విషయంలో ట్రంప్, మస్క్ మధ్య మొదలైన విభేదాలు సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణల వరకు వెళ్లడం గమనార్హం.