Jammu and Kashmir: కథువాలో ఎన్‌కౌంటర్.
ఉగ్రవాదుల్ని చుట్టుముట్టిన భద్రతా దళాలు..;
పాక్ సరిహద్దు జమ్మూ కాశ్మీర్‌లో ఆదివారం కాల్పులు కలకలం రేపాయి. కథువా జిల్లా హిరానగర్ సెక్టార్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదుల కదలికల గురించి నిఘా వర్గాల సమాచారం మేరకు, హిరానగర్‌లోని మన్యాల్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అక్కడ అడపాదడపా కాల్పులు జరుగుతున్నాయని జవాన్లు తెలిపారు. ఇద్దరు నుంచి ముగ్గురు ఉగ్రవాదులను దళాలు మట్టుబెట్టినట్లు ప్రాథమిక నివేదికల ప్రకారం మేరకు తెలుస్తోంది. నలుగురు లేదా ఐదుగురు ఉగ్రవాదులు ఈ ప్రాంతంలోకి చొరబడి ఉండవచ్చని భద్రతా వర్గాలు తెలిపాయి.
వీరిని భద్రతా బలగాలు చుట్టుముట్టినట్లు సమాచారం. జమ్మూ కాశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, భారత సైన్యం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) లతో కూడిన బలగాలు హిరానగర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో జాయింట్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. స్థానిక నివాసులు సాయుధ వ్యక్తుల్ని గుర్తించిన తర్వాత పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ ప్రారంభమైంది. సంఘటన స్థలానికి అదనపు బలగాలను తరలించారు.
స్థానికంగా ఉన్న వారు తమ పంట పొలాల్లో ఆయుధాలతో అనుమానంగా కనిపించిన వెంటనే వారు భద్రతా దళాలకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆర్మీ అధికారులు, జవాన్లు అనుమానితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. BSF, భారత సైన్యం, జమ్మూ మరియు కాశ్మీర్ పోలీసుల సిబ్బంది ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి జాయింట్ ఆపరేషన్ ప్రారంభించారు.