జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. జార్ఖండ్‌లోని బొకారో జిల్లా లాల్ పానియా దగ్గర భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు.
సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలైన సీఆర్పీఎఫ్ బలగాలు కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. తెల్లవారుజామున లాల్‌పానియా వద్ద భద్రతాబలగాలకు, మావోలకు మధ్య ఎదురు కాల్పులు జరుగగా.. ఆరుగురు మావోలు ప్రాణాలు కోల్పోయారు. ఆపరేషన్ కొనసాగుతోందని సీఆర్పీఎఫ్ బలగాలు చెబుతున్నాయి.
మరోవైపు చనిపోయిన మావోయిస్టుల అందరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఎస్‌ఎల్ఆర్, ఇన్సాస్, రైఫిల్స్‌తో పాటు మందుగుండు సామాగ్రిని సీఆర్పీఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇక దేశవ్యాప్తంగా కూడా మావోయిస్టులను మట్టుబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల్లో కూంబింగ్ పేరిట పెద్ద ఎత్తున ఆపరేషన్లు నిర్వహించారు. ఇప్పుడు జార్ఖండ్‌లో కూడా పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహించగా.. మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో వెంటనే ఇరువురి మధ్య భీకరమైన కాల్పులు సంభవించాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు.