Delhi: ఢిల్లీలో నలుగురు సిగ్మా గ్యాంగ్ సభ్యుల ఎన్‌కౌంటర్
అర్ధరాత్రి గ్యాంగ్ మొత్తాన్ని లేపేసిన పోలీసులు..
బిహార్‌కు చెందిన కరడుగట్టిన ‘సిగ్మా గ్యాంగ్’లోని నలుగురు గ్యాంగ్‌స్టర్లు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. దిల్లీ, బిహార్ పోలీసుల సంయుక్త బృందం దిల్లీలోని రోహిణి ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఈ ఆపరేషన్ చేపట్టింది. పోలీసుల కాల్పుల్లో రంజన్ పాఠక్ , బిమ్లేశ్ మహతో, మనీశ్ పాఠక్ , అమన్ ఠాకుర్ , హతమయ్యారు. వీరందరూ బిహార్‌లోని సీతామడీకి చెందినవారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సిగ్మా గ్యాంగ్ సభ్యులు దిల్లీలో దాక్కుని నేరపూరిత చర్యలకు కుట్రపన్నుతున్నట్టు నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు వెళ్లారు. వారిపై నలుగురు గ్యాంగ్‌స్టర్లు కాల్పులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. నలుగురు గ్యాంగ్‌స్టర్లకు తూటాలు తగిలి తీవ్ర గాయాలయ్యాయి. వారిని రోహిణిలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆ నలుగురు మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.. గ్యాంగ్‌స్టర్ల కాల్పుల్లో పలువురు పోలీసులకూ గాయాలయ్యాయి. వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. బిహార్‌లోని బ్రహ్మర్షి సేన నాయకుల హత్యల్లోనూ సిగ్మా గ్యాంగ్ పాత్ర ఉందని పోలీసు అధికారులు తెలిపారు.