PM Mudra Yojana Scam : కేవలం రూ. 860 కే రూ.7 లక్షల లోనా? పప్పులో కాలేస్తే మీకే నష్టం బాసూ.

Update: 2026-03-07 07:00 GMT

PM Mudra Yojana Scam : ప్రస్తుతం డిజిటల్ యుగంలో అమాయకులే టార్గెట్‌గా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ముద్రా యోజన పేరుతో భారీ దోపిడీకి తెరలేపారు. సోషల్ మీడియాలో నకిలీ అప్రూవల్ లెటర్లను పంపిస్తూ.. మీకు రూ.7 లక్షల లోన్ మంజూరైందని, దాన్ని పొందేందుకు కేవలం రూ.860 ప్రాసెసింగ్ ఫీజు కడితే చాలని నమ్మిస్తున్నారు. ఇలాంటి మోసపూరిత లేఖలపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం హెచ్చరించింది. ఈ మేరకు అప్రూవల్ లెటర్లన్నీ నకిలీవని, ప్రభుత్వం ఇలాంటి రుసుములను ఎప్పుడూ నేరుగా అడగదని స్పష్టం చేసింది.

ఎందుకింత సులభంగా నమ్మేస్తున్నారు?

ముద్రా లోన్ అనేది దేశంలోని చిన్న వ్యాపారులకు ఎంతో మేలు చేసే నిజమైన పథకం. దీని గురించి దాదాపు అందరికీ అవగాహన ఉండటంతో, మోసగాళ్లు ఆ నమ్మకాన్నే పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. అయితే ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ముద్రా (Micro Units Development and Refinance Agency) సంస్థ నేరుగా ప్రజలకు లోన్లు ఇవ్వదు. ఇది కేవలం బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు డబ్బును రీఫైనాన్స్ చేస్తుంది. ఆయా బ్యాంకులు మాత్రమే అర్హులైన వ్యాపారులకు రుణాలు అందిస్తాయి. కాబట్టి నేరుగా ముద్రా పేరుతో లెటర్ వస్తే అది నూటికి నూరు శాతం ఫేక్ అని గుర్తుంచుకోవాలి.

నకిలీ ముద్రా ఆఫర్లను ఎలా గుర్తించాలి?

కొన్ని చిన్నపాటి జాగ్రత్తలతో ఈ మోసాలను ఇట్టే కనిపెట్టవచ్చు. అవేంటంటే:

* లోన్ మంజూరు కావడానికి ముందే ప్రాసెసింగ్ ఫీజు లేదా అగ్రిమెంట్ ఛార్జీలు కట్టాలని కోరడం.

* మీరు అప్లై చేయకుండానే ప్రీ-అప్రూవ్డ్ లోన్ అంటూ మెసేజ్ రావడం.

* బ్యాంక్ మేనేజర్ కాకుండా కేవలం వాట్సాప్ లేదా ప్రైవేట్ నంబర్ల ద్వారానే కాంటాక్ట్ చేయడం.

* ముద్రా లోగోతో అనాధికారిక లెటర్లను పంపడం.

* అతి తక్కువ డాక్యుమెంట్లతో, ఎలాంటి గ్యారెంటీ లేకుండా లోన్ ఇస్తామని నమ్మబలకడం.

మోసపోతే ఏం చేయాలి?

ఒకవేళ మీరు ఇప్పటికే ఇలాంటి వారి వలలో పడి డబ్బులు చెల్లించి ఉంటే.. ఆలస్యం చేయకుండా వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ముందుగా మీ బ్యాంక్ లేదా పేమెంట్ యాప్ ప్రొవైడర్‌కు ఫిర్యాదు చేసి ఆ ట్రాన్సాక్షన్‌ను ఆపమని కోరండి. అనంతరం జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ (www.cybercrime.gov.in)లో ఫిర్యాదు చేయండి లేదా 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి. మీరు చేసిన చెల్లింపుల రసీదులు, స్క్రీన్‌షాట్లు, మెసేజ్‌లు, ఫోన్ నంబర్లను ఆధారాలుగా భద్రపరుచుకుని దగ్గర్లోని సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేయండి.

ముద్రా లోన్ వివరాలు ఇవే:

ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద చిన్న వ్యాపారాలకు నాలుగు విభాగాల్లో రుణాలు ఇస్తారు:

శిశు: రూ. 50,000 వరకు

కిషోర్: రూ. 50,000 నుంచి రూ. 5 లక్షల వరకు

తరుణ్: రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు

తరుణ్ ప్లస్: రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు

ఈ రుణాలు కేవలం తయారీ, వాణిజ్యం, సేవలు, స్వయం ఉపాధి వంటి వ్యవసాయేతర పనులకే ఇస్తారు. ఎప్పుడూ అధికారిక బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి మాత్రమే లోన్ కోసం దరఖాస్తు చేసుకోండి. ఏదైనా ఏజెంట్ వచ్చి ఫీజు ఇస్తే లోన్ ఇప్పిస్తానంటే నమ్మకండి.

Tags:    

Similar News