Family Suicide: ‘గుట్కా’ కొనడానికి డబ్బులు ఇవ్వలేదని దారుణానికి పాల్పడ్డ మహిళ..
‘గుట్కా’ కొనడానికి డబ్బులు ఇవ్వలేదని దారుణానికి పాల్పడ్డ మహిళ..;
గుట్కాకు అలవాటుపడిన మహిళ వాటి కోసం భర్తను డబ్బులు అడిగింది. అతడు నిరాకరించడంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో తనతో పాటు పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్యకు పాల్పడింది. ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మజ్‌గవాన్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల జోత్యి గుట్కాకు బానిస అయ్యింది. అయితే అనారోగ్యానికి కారణమైన గుట్కా అలవాటు మానాలని భర్త బబ్బు యాదవ్ చెబుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి.
కాగా, శనివారం ఉదయం గుట్కా కొనేందుకు భర్త బబ్బు యాదవ్‌ను జ్యోతి డబ్బులు అడిగింది. అతడు నిరాకరించడంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. డ్రైవర్‌గా పని చేసే బబ్బు యాదవ్ డ్యూటీ కోసం వెళ్లిపోయాడు. ఆ రోజు సాయంత్రం జ్యోతి తన ముగ్గురు పిల్లలకు విషం కలిపిన ఆహారం తినిపించింది. ఆమె కూడా ఆ విషాహారం తిన్నది.
మరోవైపు పని తర్వాత బబ్బు ఇంటికి తిరిగి వచ్చాడు. నాలుగేళ్ల కుమారుడు నొప్పితో రోదిస్తూ కనిపించాడు. తల్లి తనకు చేదు ఆహారం తినిపించిందని చెప్పాడు. ఏడాది వయస్సున్న కుమార్తె అప్పటికే మరణించింది. జ్యోతి, మరో ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వెంటనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు.
కాగా, మెరుగైన వైద్యం కోసం సత్నా జిల్లా ఆసుపత్రికి వారిని రిఫర్ చేశారు. అక్కడకు తరలిస్తుండగా జ్యోతి, నాలుగేళ్ల కుమార్తె చంద్రమ్మ మార్గమధ్యలో మరణించారు. ఐదేళ్ల దీప్‌చంద్ ప్రాణాలతో కొట్టుమిట్లాడుతున్నాడు. చికిత్స పొందుతున్న ఆ బాలుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.