Gujarat: అన్నను చంపిన బాలుడు..తరువాత గర్భవతి వదినపై హత్యాచారం
పోలీసుల విచారణలో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు వెలుగులోకి..
గుజరాత్ లో దారుణం చోటుచేసుకుంది. పదిహేనేళ్ల బాలుడు అత్యంత కిరాతకంగా తోడబుట్టిన అన్ననే కడతేర్చాడు. ఆపై ఆరు నెలల గర్భంతో ఉన్న వదినపై అత్యాచారం చేసి హత్య చేశాడు. తల్లితో కలిసి మృతదేహాలను పాతిపెట్టి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. ఇంతటి దారుణానికి పాల్పడ్డా.. అతడిలో పశ్చాత్తాపం లేకపోవడం చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళితే..
బీహార్ నుంచి గుజరాత్ కు వలస వచ్చిన ఓ కుటుంబం జునాగఢ్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో స్థిరపడింది. గ్రామ శివార్లలోని ఆలయంలో పూజారిగా పనిచేసిన తండ్రి కోవిడ్ సమయంలో మరణించాడు. ఆ తర్వాత కుటుంబ బాధ్యతను పెద్దకొడుకు తలకెత్తుకున్నాడు. ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ తల్లిని, పదిహేనేళ్ల తమ్ముడిని పోషించాడు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకున్నాడు. భార్య ఆరు నెలల గర్భవతి. కాగా, ఇటీవల ఆ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అక్టోబర్ 16 న ఆ ఇంట్లో దారుణం చోటుచేసుకుంది.
తరచూ కొడుతున్నాడని అన్నపై పగ పెంచుకున్న పదిహేనేళ్ల బాలుడు ఇనుప రాడ్డుతో అన్నను కొట్టి చంపాడు. ఆపై వదినపై అత్యాచారం చేసి హత్య చేశాడు. వేడుకుంటున్నా కనికరించలేదు. ఆపై తల్లి సాయంతో అన్నావదినల మృతదేహాలను నగ్నంగా ఇంటి వెనుక పాతిపెట్టాడు. తల్లీకొడుకులు కలిసి అన్నావదినలు బిహార్ వెళ్లిపోయారని చుట్టుపక్కల వారిని నమ్మించారు. అయితే, దీపావళి సందర్భంగా బిహార్ లోని బంధువులు అన్నావదినలకు ఫోన్ చేయగా కాల్ కలవలేదు. దీంతో వారు బాలుడికి ఫోన్ చేయగా సరిగా మాట్లాడలేదు. తల్లికి ఫోన్ చేస్తే తన పెద్ద కొడుకు, కోడలు రోడ్డు ప్రమాదంలో చనిపోయారని చెప్పింది. ఫొటోలు పంపించాలని కోరగా సమాధానం దాటవేసింది.
దీంతో అనుమానించిన బంధువులు జునాగఢ్ కు వచ్చి పోలీసులను ఆశ్రయించారు. ఆ చుట్టపక్కల ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదం జరగలేదని, భార్యాభర్తలు ఎవరూ చనిపోలేదని పోలీసులు చెప్పడంతో ఆందోళనకు గురయ్యారు. భార్యాభర్తలు కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ తల్లీకొడుకులపై నిఘా పెట్టడంతో జరిగిన ఘోరం బయటపడింది. మృతదేహాలను వెలికి తీసి పోస్ట్ మార్టం చేయించగా.. సగం పెరిగిన పిండం మహిళ గర్భంలో నుంచి బయటకు వచ్చినట్లు తేలింది. కాగా, ఇంతటి ఘోరానికి పాల్పడిన బాలుడిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించకపోవడం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ తల్లీకొడుకులను అరెస్టు చేసి జైలుకు పంపించారు.