ఉత్తర ప్రదేశ్ లోని భాగ్ పథ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జైనులు నిర్వహిస్తున్న లడ్డూ మహోత్సవం వేదిక కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. 60 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. దాదాపు 30 ఏండ్ల నుంచి జైనులు ఆదినాథుడి నిర్వాణ లడ్డూ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా లడ్డూలు సమర్పించేందుకు చెక్కతో ఏర్పాటు చేసిన వేదికపైకి భారీగా భక్తులు తరలివచ్చారు. బరువు ఎక్కువ కావడంతో వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ క్రమంలో ఏడుగురు మృతి చెందారు. 60 మంది గాయపడ్డారు. బాధితుల్లో పోలీసులు కూడా ఉన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు బాగ్పత్ పోలీస్ చీఫ్ అర్పిత్ విజయవర్గియా తెలిపారు. స్వల్ప గాయాలైన వారికి ప్రథమ చికిత్స అందించి ఇంటికి పంపగా, మరికొందరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తు న్నారు. ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.