Train Accident : రెండు రైళ్లు ఢీ .. తృటిలో తప్పిన ఘోర ప్రమాదం
ఇంజిన్ బోల్తా, ఒకదానిపైకి ఒకటి ఎక్కిన బోగీలు;
పంజాబ్‌లోని మాధోపూర్, సిర్హింద్ సమీపంలో రెండు రైల్వే గూడ్స్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రైలులోని ఇద్దరు డ్రైవర్లు గాయపడ్డారు. క్షతగాత్రులను శ్రీ ఫతేగర్ సాహిబ్ సివిల్ ఆసుపత్రిలో చేర్పించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో పాటియాలాలోని రాజిందర్ ఆసుపత్రికి తరలించారు. రైల్వే అధికారులు, రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకున్నాయి.
తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఢీకొనడంతో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఒక రైలు పట్టాలు తప్పింది. ఢీకొన్న వెంటనే అంబాలా నుంచి జమ్ముతావికి వెళ్తున్న సమ్మర్ స్పెషల్ (04681) ప్యాసింజర్ రైలు ఇంజన్ బోల్తా పడింది. దీంతో రైలుకు కూడా కొంత నష్టం వాటిల్లింది. ప్యాసింజర్ రైలులో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఉపశమనం కలిగించే అంశం. ప్రమాదం కారణంగా ట్రాక్ పరిస్థితి చాలా అధ్వాన్నంగా మారింది.
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు, ఉద్యోగులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైల్వే సిబ్బంది కిటికీ అద్దాలు పగులగొట్టి ఇంజిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్లను బయటకు తీశారు. అక్కడి నుంచి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ప్యాసింజర్ రైలుకు కొంత నష్టం వాటిల్లినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అందులో మరో ఇంజన్‌ను అమర్చి రైలును రాజ్‌పురా వైపు పంపారు.