డెంగ్యూ భయం.. దోమల్ని పట్టుకుని ఆస్పత్రికి..
ఎక్కడ చూసినా దోమలు.. అవి కుడితే ఎక్కడ డెంగ్యూ వస్తుందో అని భయం. మున్సిపాలిటీ వాళ్లు సరైన చర్యలు తీసుకుంటే దోమల్ని నివారించడం అంత కష్టమేమీ కాదు.;
ఎక్కడ చూసినా దోమలు.. అవి కుడితే ఎక్కడ డెంగ్యూ వస్తుందో అని భయం. మున్సిపాలిటీ వాళ్లు సరైన చర్యలు తీసుకుంటే దోమల్ని నివారించడం అంత కష్టమేమీ కాదు.. కానీ ఎన్ని సార్లు చెప్పినా పట్టనట్టే ఉంటున్నారు. అందుకే అతడు దోమల్ని పట్టుకుని ఆస్పత్రికి వెళ్లాడు. తనని కుట్టిన దోమల వల్ల డెంగ్యూ వస్తుందేమో చూసి చెప్పమన్నాడు.. వైద్యులు దోమల్ని చూసి షాకయ్యారు. ముందు అర్జంటుగా ఆ దోమల్ని తీసుకుని బయటకు నడువు. కావాలంటే నీకు ఉచితంగా వైద్యం చేస్తాం అంటూ అతడిని దోమల కవర్ తో సహా బయటకు పంపించారు.
పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా బర్ధమాన్ జిల్లాలో శుక్రవారం ఒక వ్యక్తి దోమలతో నిండిన బ్యాగ్‌తో స్థానిక ఆసుపత్రికి వచ్చాడు. మంగళ్‌కోట్‌లోని ఖుర్తుబా గ్రామానికి చెందిన మన్సూర్ అలీ షేక్ అనే వ్యక్తి దాదాపు 25 నుండి 30 దోమలను సేకరించి, ఆ ప్రాంతంలో డెంగ్యూ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళనతో పాలిథిన్ సంచిలో ఆసుపత్రికి తీసుకువచ్చాడు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ జుల్ఫికర్ అలీ మొదట ఆ వ్యక్తి మెడికల్ ఎమర్జెన్సీతో వచ్చారని భావించారు. అయితే దోమలను చూసి ఆయనతో పాటు ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
మన్సూర్ పరిస్థితిని వివరిస్తూ, "నా దుకాణం చుట్టూ నీరు నిలిచి ఉంది, అక్కడ దోమలు వృద్ధి చెందుతున్నాయి. దుకాణం చుట్టూ ఉన్న అపరిశుభ్ర వాతావరణం కారణంగా దోమలు, పురుగులు వచ్చి చేరుతాయి. మున్సిపాలిటీ వాళ్లకు ఎన్ని సార్లు చెప్పినా పెడచెవిన పెడుతున్నారు. "నన్ను నేను రక్షించుకోవడానికి, దోమల సమస్యను పరిష్కరించడానికి, నేను కొన్ని దోమలను పాలిథిన్ సంచిలో పట్టుకుని ఆసుపత్రికి తీసుకువచ్చాను. ఈ విధంగా, డాక్టర్ బాబు దోమలను పరీక్షించి సరైన చికిత్స అందించగలరని నేను భావిస్తున్నాను అని అంటూ తమ ప్రాంతంలోని డ్రెయిన్‌ను వెంటనే శుభ్రం చేయాలని మున్సిపాలిటీ అధికారులకు సూచించాడు.
ఈ ఘటనపై మంగళకోటే పంచాయతీ సమితి మత్స్య అధికారి సయ్యద్ బసీర్ స్పందిస్తూ.. ఈ విషయాన్ని బ్లాక్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ (BMOH), బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (BDO) దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఈ ప్రాంతంలో దోమల సమస్యను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని, అలాగే నిలిచిపోయిన నీటి నివారణకు దోమల నివారణ మందులను, బ్లీచింగ్ పౌడర్‌ను పంపిణీ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.