HIV Positive: బ్లడ్ బ్యాంక్ నిర్వాకం.. ఐదుగురు చిన్నారులకు హెచ్ఐవీ పాజిటివ్
ఝార్ఖండ్‌లో వైద్యుల నిర్లక్ష్యం
ఝార్ఖండ్‌లో అత్యంత దారుణమైన వైద్య నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని చైబాసా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తమార్పిడి చేయించుకున్న ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ సోకినట్లు నిర్ధారణ కావడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. బాధితుల్లో ఏడేళ్ల థలసేమియా వ్యాధిగ్రస్తుడు కూడా ఉండటంతో సర్వత ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.
థలసేమియాతో బాధపడుతున్న తమ చిన్నారికి చైబాసా సదర్ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ నుంచి హెచ్‌ఐవీ సోకిన రక్తం ఎక్కించారని ఓ కుటుంబం శుక్రవారం ఆరోపించడంతో ఈ దారుణం వెలుగు చూసింది. ఫిర్యాదు అందిన వెంటనే ఝార్ఖండ్ ప్రభుత్వం, ఆరోగ్య సేవల డైరెక్టర్ డాక్టర్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల వైద్య బృందాన్ని రాంచీ నుంచి చైబాసాకు పంపింది.
శనివారం ఆసుపత్రిలో విచారణ చేపట్టిన వైద్య బృందానికి దిగ్భ్రాంతికర వాస్తవాలు తెలిశాయి. అదే ఆసుపత్రిలో క్రమం తప్పకుండా రక్తమార్పిడి చేయించుకుంటున్న మరో నలుగురు థలసేమియా చిన్నారులకు కూడా హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలింది. దీంతో బాధితుల సంఖ్య ఐదుకు చేరింది. "ప్రాథమిక విచారణలో భాగంగా కలుషిత రక్తాన్ని థలసేమియా రోగికి ఎక్కించినట్లు తెలుస్తోంది. బ్లడ్ బ్యాంక్‌లో కొన్ని లోపాలను గుర్తించాం. వాటిని సరిదిద్దాలని సంబంధిత అధికారులను ఆదేశించాం" అని డాక్టర్ దినేష్ కుమార్ మీడియాకు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా, ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్‌ను కొన్ని రోజుల పాటు అత్యవసర సేవలకు మాత్రమే పరిమితం చేశారు.
విచారణ బృందం బ్లడ్ బ్యాంక్‌తో పాటు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను కూడా తనిఖీ చేసి, బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడింది. రక్తాన్ని పరీక్షించే విధానంలో, రికార్డుల నిర్వహణలో, భద్రతా ప్రమాణాల పాటింపులో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై రాష్ట్ర ఆరోగ్య శాఖకు నివేదిక సమర్పించారు.
అయితే, జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ సుశాంతో కుమార్ మఝీ మాట్లాడుతూ.. కేవలం రక్తమార్పిడి వల్లే ఇన్‌ఫెక్షన్ సోకిందని ఇప్పుడే నిర్ధారించడం తొందరపాటు అవుతుందని అన్నారు. కలుషితమైన సూదుల వాడకం వంటి ఇతర కారణాల వల్ల కూడా హెచ్‌ఐవీ సోకే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
వ్యక్తిగత కక్షల కోణం.. హైకోర్టు జోక్యం
ఈ ఘటన వెనుక ‘వ్యక్తిగత కక్షల’ ఉండవచ్చని మంఝారీ జిల్లా పరిషత్ సభ్యుడు మాధవ్ చంద్ర కుంకల్ ఆరోపించడం వివాదాస్పదంగా మారింది. బ్లడ్ బ్యాంక్ ఉద్యోగికి, బాధితుడి బంధువుకు మధ్య ఏడాదిగా కోర్టులో కేసు నడుస్తోందని ఆయన తెలిపారు. మరోవైపు, ఈ ఘటనను ఝార్ఖండ్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై పూర్తి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి, జిల్లా సివిల్ సర్జన్‌ను ఆదేశించింది. అధికారిక లెక్కల ప్రకారం, పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో 515 హెచ్‌ఐవీ పాజిటివ్ కేసులు, 56 మంది థలసేమియా రోగులు ఉన్నారు. అధికారులు ప్రస్తుతం రక్తాన్ని దానం చేసిన వారి వివరాలు తెలుసుకుని, ఇన్‌ఫెక్షన్ మరింత వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు.