Karnataka: కర్ణాటకలో దారుణం .. వన్యప్రాణులపై విషప్రయోగం..

5 పులులు మృతి..దర్యాప్తునకు మంత్రి ఆదేశం;

Update: 2025-06-27 03:45 GMT

కర్ణాటకలో దారుణం జరిగింది. అభయారణ్యంలో వన్యప్రాణుల పట్ల కర్కశంగా ప్రవర్తించారు. విషప్రయోగం ప్రయోగించడంతో ఐదు పులులు మృత్యువాత పడ్డాయి. కర్ణాటకలోని మలేమహదేశ్వర హిల్స్‌లోని హూగ్యం అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

పులి, దాని నాలుగు పిల్లలు చనిపోయాయని అధికారులు తెలిపారు. ఒకేరోజు ఐదు పులులు చనిపోవడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి అని అధికారులు వెల్లడించారు. అయితే చనిపోయిన పులి కొన్ని రోజుల క్రితం ఒక ఆవును చంపిందని అటవీ అధికారులు తెలిపారు. అయితే సమీప గ్రామస్తులు పగతో కళేబరంలో విషం కలిపి పులికి ఎర వేసి ఉంటారని.. ఆ కళేబరం తిన్న పులులు చనిపోయి ఉండొచ్చని పేర్కొన్నారు. శవపరీక్షలో కూడా విష ప్రయోగం వల్లే చనిపోయినట్లుగా తేలిందని చెప్పారు.

ఇక ఈ మరణాలు అసహజమైనవి అని.. దర్యాప్తు చేసి మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఆదేశించారు. ఇక అటవీ శాఖ నిర్లక్ష్యం అని తేలినా.. మరేదైనా కారణం వల్ల చినపోయినట్లు తేలితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మంత్రి వార్నింగ్ ఇచ్చారు. అయితే తమ జంతువులపై పులులు దాడి చేస్తున్నాయని.. ఎంఎంహిల్స్, దాని చుట్టు పక్కల ప్రాంత ప్రజలు విషప్రయోగం చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు.

ప్రస్తుతం కర్ణాటకలో 563 పులులు ఉన్నాయి. మధ్యప్రదేశ్ తర్వాత అంత ఎక్కువగా ఉన్నది కర్ణాటకలోనే. ఈ పులుల సంరక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా… సమీప గ్రామస్తులు విషప్రయోగంతో చంపేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం పులుల మరణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు చంపారన్న దానిపై ఆరా తీస్తున్నారు.


Tags:    

Similar News