దేశ చరిత్రలో కీలక ఘట్టమైన ఆర్టికల్ 370, 35 (ఏ)లను రద్దు చేస్తూ పార్లమెంట్ నిర్ణయించి ఐదేళ్లు గడుస్తోంది. ఈ నిర్ణయం జమ్మూ కశ్మీర్తో పాటు, లడఖ్ పురోగతికి, శ్రేయస్సుకు సంబంధించి కొత్త శకానికి నాంది పలికింది. రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయులతో పాటు ప్రతీ ఒక్కరి దృక్పథానికి అనుగుణంగా భారత రాజ్యాంగం ఈ ప్రదేశాల్లో అమలైందని దీని అర్ధం అని ప్రధాని మోదీ తెలిపారు.
ఈ నిర్ణయం తీసుకొని సోమవారం నాటికి ఐదేళ్లు గడిచిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆర్టికల్ రద్దు ద్వారా, అప్పటి వరకు అభివృద్ధి ఫలాలు అందుకోలేని మహిళలు, యువత వెనకబడిన, గిరిజన, అట్టడగు వర్గాలకు భద్రత, గౌరవం, అన్ని రంగాల్లో అవకాశాలు లభించాయని మోదీ అభిప్రాయపడ్డారు. ఇక దశాబ్దాలుగా జమ్మూ కశ్మీరు పట్టి పీడిస్తున్న అవినీతిని అరికట్టేలా ఆర్టికల్ 370 రద్దు చేసిందన్నారు.
రానున్న రోజుల్లో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం జమ్ముకశ్మీర్, లడఖ్ ప్రజల కోసం పనిచేస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. మరో పక్క కేంద్రం భద్రత విషయంలో కీలక చర్యలు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. సైనిక సిబ్బందిని తరలించే కాన్వాయ్ రాకపోకలను నిలిపివేసింది. జవాన్ల కాన్వాయ్ పై దాడి జరిగే అవకాశాలున్నాయన్న నిఘా వర్గాల సమాచారంతో ఈ నిర్ణయం తీసుకుంది.