Portuguese Man o' War: యూకే బీచ్ లో వింత జీవులు... ముట్టుకుంటే మటాషే ..
ఈ జీవులు చనిపోయిన తర్వాత కూడా వాటి స్టింగ్ ప్రాణాంతకమని సూచన
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని వేల్స్ తీరంలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. అత్యంత ప్రమాదకరమైన సముద్ర జీవులు అయిన "పోర్చుగీస్ మ్యాన్ ఓ' వార్" పెద్ద సంఖ్యలో ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. "ఫ్లోటింగ్ టెర్రర్స్" (తేలియాడే భయానక జీవులు)గా పిలిచే ఈ జీవులు అబెరావాన్ బీచ్‌తో పాటు పెంబ్రోక్‌షైర్, గ్వినెడ్, ఆంగ్లెసీ తీర ప్రాంతాల్లో కనిపించడంతో పోర్ట్ టాల్బోట్ కోస్ట్‌గార్డ్ అధికారులు ప్రజలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వీటిని పొరపాటున కూడా తాకవద్దని, అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
చూడటానికి జెల్లీఫిష్‌లా కనిపించినప్పటికీ, పోర్చుగీస్ మ్యాన్ ఓ' వార్ అత్యంత విషపూరితమైనది. దీని టెంటకిల్స్ (స్పర్శకాలు) చర్మానికి తగిలితే తీవ్రమైన నొప్పి, దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో జ్వరం, షాక్, శ్వాస సంబంధిత సమస్యలు కూడా తలెత్తవచ్చు. అరుదుగా ప్రాణాంతకమైన అలర్జిక్ రియాక్షన్లకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆశ్చర్యకరంగా, ఈ జీవి చనిపోయిన తర్వాత కూడా దాని టెంటకిల్స్‌లో విషం ఉంటుంది. అందుకే ఒడ్డున పడి ఉన్న వాటిని కూడా ముట్టుకోకూడదని స్పష్టం చేశారు.
వైల్డ్‌లైఫ్ ట్రస్ట్స్ ప్రకారం, పోర్చుగీస్ మ్యాన్ ఓ' వార్ వాస్తవానికి ఒక జెల్లీఫిష్ కాదు. ఇది ఒక సైఫనోఫోర్, అంటే అనేక చిన్న జీవులు ఒక సమూహంగా ఏర్పడి జీవించే ఒక విలక్షణమైన జీవి. దీనికి పారదర్శకమైన ఊదా రంగు బుడగ లాంటి శరీరం, గులాబీ రంగు శిఖరం, పొడవైన నీలిరంగు టెంటకిల్స్ ఉంటాయి. సాధారణంగా సముద్ర ఉపరితలంపై తేలియాడే ఈ జీవులు.. బలమైన గాలులు, తుపానుల కారణంగా ఒడ్డుకు కొట్టుకొస్తుంటాయి. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం, దీని విషం చిన్న సముద్ర జీవులను పక్షవాతానికి గురిచేసి చంపగలదు. మనుషులకు దీని కాటు భరించలేని నొప్పిని కలిగిస్తుంది.
ఒకవేళ ఎవరైనా దీని బారిన పడితే, వెంటనే అది తాకిన భాగాన్ని సముద్రపు నీటితో శుభ్రం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. చర్మానికి అంటుకున్న టెంటకిల్స్‌ను చేతితో కాకుండా, ఏదైనా కార్డ్ వంటి వస్తువుతో జాగ్రత్తగా తొలగించాలి. ఆ తర్వాత ఆ భాగాన్ని వేడి నీటిలో ఉంచి, తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలి. ప్రమాదకరమైన ఈ జీవులను బీచ్ నుంచి తొలగించే పనిని కోస్ట్‌గార్డ్ సిబ్బంది చేపట్టారు.