Malegaon Blast Case: మాలేగావ్ పేలుళ్ల కేసులో సంచలన తీర్పు
నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన ప్రత్యేక కోర్టు;
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 నాటి మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితులు అందరూ నిర్దోషులేనని ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్, లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ సహా మొత్తం ఏడుగురు అభియోగాలు ఎదుర్కొన్నారు. సుదీర్ఘంగా జరిగిన విచారణ తర్వాత వారంతా నిర్దోషులేనని ముంబై ప్రత్యేక కోర్టు తేల్చింది. తీర్పు సందర్భంగా కోర్టు ప్రాసిక్యూషన్ వాదనలలో లోపాలను ఎత్తిచూపింది. బాంబును స్కూటర్ కు అమర్చి పేలుడు జరిపారని ప్రాసిక్యూషన్ నిర్ధారించలేకపోయిందని, తగిన ఆధారాలు చూపలేకపోయిందని పేర్కొంది.
మహారాష్ట్రలోని మాలేగావ్‌లో 2008 సెప్టెంబరు 29న భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. సుమారు వందమందికి పైగా గాయపడ్డారు. ఈ కేసును తొలుత యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) దర్యాప్తు చేపట్టగా.. కేసు తీవ్రత దృష్ట్యా తర్వాత ప్రభుత్వం దీనిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కు అప్పగించింది. ఈ పేలుళ్లకు సంబంధించి అప్పటి ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ పైనా ఆరోపణలు వచ్చాయి. ప్రజ్ఞా ఠాకూర్ కు చెందిన మోటార్ సైకిల్ కు బాంబు అమర్చారని దర్యాప్తులో తేలిందని అధికారులు చెప్పారు. దీంతో ఈ కేసులో ప్రజ్ఞా ఠాకూర్ ను నిందితురాలిగా చేర్చారు. ఈ కేసులో ఇప్పటివరకు 220 మంది సాక్షులను విచారించగా.. వారిలో 15 మంది అంతకుముందు తాము ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మాట్లాడారు.