Achrekar memorial: గురువు అచ్రేకర్‌ స్మారకాన్ని ఆవిష్కరించిన సచిన్‌ టెండూల్కర్‌

గుర్తు పట్టలేనంతగా మారిపోయిన వినోద్ కాంబ్లి;

Update: 2024-12-04 02:30 GMT

చిన్ననాటి నుంచి తనకు క్రికెట్‌లో ఓనమాలు నేర్పించి, ప్రపంచంలోనే దిగ్గజ క్రికెటర్‌గా తీర్చిదిద్దిన కోచ్‌ రమాకాంత్ అచ్రేకర్‌  స్మారకాన్ని క్రికెట్‌ లెజండ్‌ సచిన్‌ టెండూల్కర్‌  ఆవిష్కరించారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని శివాజీ పార్క్‌లో ఈ స్మారకాన్ని నిర్మించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన అధ్యక్షుడు రాజ్‌ థాకరే కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సచిన్‌ టెండూల్కర్‌ మాట్లాడుతూ.. క్రికెట్‌కు, నా జీవితానికి ఎంతో మేలు చేసిన ఆ మహనీయుడికి ఇవాళ స్మారకాన్ని ఆవిష్కరించి, నివాళి అర్పించే అవకాశం రావడం తన అదృష్టమని అన్నారు. ఈ రోజు తనకు ఎంతో ప్రత్యేకమైన రోజు అని చెప్పారు. ఈ స్మారకం ఆవిష్కరణ కార్యక్రమంలో మీరంతా పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందని కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి సచిన్‌ అన్నారు.

సచిన్‌కు క్రికెట్‌ కోచ్‌ అయిన రమాకాంత్‌ అచ్రేకర్‌ జయంతిని పురస్కరించుకుని ఇవాళ శివాజీ పార్కులో ఆయన స్మారకాన్ని ఆవిష్కరించారు. అచ్రేకర్‌ అందించిన సేవలకు గుర్తింపుగా 1990లో ఆయనను ప్రతిష్ఠాత్మక ద్రోణాచార్య అవార్డుతో సత్కరించారు. 2010లో ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. 2019 జనవరిలో అచ్రేకర్‌ మరణించారు. అచ్రేకర్‌ సచిన్‌తోపాటు వినోద్‌ కాంబ్లీ, సంజయ్‌ బంగర్‌, రమేశ్‌ పవార్‌, అజిత్‌ అగార్కర్‌ లాంటి ఎంతో మందిని మంచి క్రికెటర్‌లుగా తీర్చిదిద్దారు.

సచిన్ చేయి వదలని కాంబ్లి

సచిన్, వినోద్ కాంబ్లి ఇద్దరూ రమాకాంత్ అచ్రేకర్ శిష్యులే. ఇద్దరూ ఇండియన్ క్రికెట్ లోకి దూసుకొచ్చి తమదైన ముద్ర వేసిన తీరు కూడా ఒకేలా ఉంటుంది. అయితే ఆ ఇద్దరిలో ఒకరు ప్రపంచమే మెచ్చిన గొప్ప క్రికెటర్ గా నిలవగా.. మరొకరు మొదట్లోనే కనుమరుగైపోయారు. ఇప్పుడు వినోద్ కాంబ్లి పరిస్థితి దారుణంగా ఉంది. కనీసం సరిగా నడవలేని దుస్థితిలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో   దివంగత కోచ్ రమాకాంత్ అచ్రేకర్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈవెంట్లో సచిన్ ను కలిశాడు కాంబ్లి. అతన్ని చూడగానే భావోద్వేగానికి గురైన కాంబ్లి.. స్టేజ్ పైకి వచ్చిన సచిన్ చేయి పట్టుకొని వదలకుండా అలాగే ఉండిపోయాడు. సచిన్ మాత్రం చేయి వదిలించుకొని ముందుకు సాగాలని అనుకున్నా.. కాంబ్లి మాత్రం వదల్లేదు. పక్కనే ఉన్న వ్యక్తి చొరవతో మొత్తానికి సచిన్ ముందుకు సాగాడు.

Tags:    

Similar News