Rohit Arya : బీజేపీలో చేరిన మధ్యప్రదేశ్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి

బీజేపీ రాష్ట్ర విభాగం చీఫ్ ఆధ్వర్యంలో పార్టీ కండువా;

Update: 2024-07-14 08:15 GMT

మధ్యప్రదేశ్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ ఆర్య భారతీయ జనతా పార్టీలో చేరారు. పదవీ విరమణ చేసిన దాదాపు మూడు నెలల అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకొన్నారు. భోపాల్‌లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర విభాగం చీఫ్ డాక్టర్ రాఘవేంద్ర శర్మ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు.

1962 ఏప్రిల్ 28న జన్మించిన జస్టిస్ ఆర్య 1984 ఆగస్టులో న్యాయవాదిగా విధుల్లో చేరారు. 2003 ఆగస్టు 26న మధ్యప్రదేశ్ హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమితులయ్యారు. 2013 సెప్టెంబరు 12న మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన.. 2015 మార్చి 26న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.

తన వృత్తి జీవితంలో అనేక కేసులను పరిష్కరించి తనకంటూ గుర్తింపు సంపాదించారు. 2021లో ఇందౌర్‌లో జరిగిన న్యూ ఇయర్ ఈవెంట్‌లో చెలరేగిన మతపరమైన ఘర్షణలు, హాస్యనటులు మునావర్ ఫరూకీ, నలిన్ యాదవ్‌ కోవిడ్-19 ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన కేసులను విచారించారు. 2020లో మరొక ముఖ్యమైన కేసులో యువతితో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో ఓ నిందితుడికి బెయిల్‌ మంజూరు చేస్తూ.. యువతితో అతడికి రాఖీ కట్టించారు. ఇకపై తనను ఓ సోదరిగా భావించాలని.. ఆమెకు ఎటువంటి హానీ చేయకూడదని షరతులు విధించారు. కాగా ఈ తీర్పును పలువురు విమర్శించడంతో సుప్రీం కోర్టు రద్దు చేసింది.

Tags:    

Similar News