Radhika Yadav: రాధిక యాదవ్ హత్య కేసులో సంచలన విషయాలు..
నిందితుడు పశ్చత్తాపంతో కుమిలిపోతున్నాడంటున్న కుటుంబీకులు;
హర్యానా రాష్ట్రం గురుగావ్‌లో మాజీ జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ ను తండ్రి హత్య చేసిన సంగతి తెలిసిందే. రాధిక తండ్రి దీపక్ ఆమెపై వెనుక నుంచి మూడు బుల్లెట్లను పేల్చారని, దీంతో ఆమె అక్కడికక్కడే మరణించారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆవేశంలో కుమార్తెను తండ్రి చంపేశాడని.. ఇప్పుడు పశ్చత్తాపంతో కుమిలిపోతున్నారని కుటుంబీకులు వెల్లడించారు.
దీపక్ సోదరుడు విజయ్ యాదవ్ తాజాగా మీడియాతో సంచలన విషయాలు వెల్లడించారు. తాను దీపక్ వెంట పోలీసు స్టేషన్‌లో ఉన్నప్పుడు అతడు ఎంతో పశ్చాత్తాపంతో ఉన్నాడని తెలిపారు. తనను ఉరితీసేలా ఎఫ్‌ఐఆర్ రాయాలని పోలీసులతో దీపక్ చెప్పినట్లు విజయ్ వెల్లడించారు. తాను ఆడపిల్లను చంపేశానంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఏడ్చాడని చెప్పారు. కాగా.. ప్రస్తుతం దీపక్‌ను రెండువారాల జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించారు.
అయితే, ఇప్పటికే రాధిక హత్యకు సంబంధించి వివిధ రకాలుగా వార్తలు బయటకు వచ్చాయి. రాధిక సంపాదనపై ఆధారపడి బతుకుతున్నారంటూ కుమార్తె అవహేళన చేయడంతోనే తండ్రి ఈ హత్యకు పాల్పడ్డారని మొదట వార్తలు వచ్చాయి. అనంతరం, రీల్స్ చేయడం కారణంగా హత్య చేసి ఉంటారనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే, ఆ కుటుంబంతో పరిచయం ఉన్నవారు మాత్రం ఆ కథనాల్లో వాస్తవం లేదని చెబుతున్నారు. రాధిక హత్యకు ఆమె ప్రేమ వ్యవహారమే ముఖ్య కారణమని అంటున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే తండ్రి, కూతురు మధ్య వాగ్వాదం కూడా జరిగినట్టు తెలిపారు.