INSURANCE: వృద్ధులకు రూ.5లక్షల ఉచిత ఆరోగ్య బీమా
సీనియర్ సిటిజన్లకు గుడ్‌న్యూస్.. ఆయుష్మాన్ వే వందన కార్డు ద్వారా రూ.5 లక్షల బీమా;
70 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. ఇకపై అనారోగ్యాలు వచ్చినా, ఆస్పత్రి ఖర్చుల గురించి భయపడాల్సిన పనిలేదు. సీనియర్ సిటిజన్ల కోసం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనలో భాగంగా ఆయుష్మాన్ వే వందన కార్డును పొందవచ్చు. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా లభిస్తుంది. ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అర్హులైన వృద్ధులు దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత సేవలు పొందొచ్చు. ఈ కార్డును ఆయుష్మాన్ యాప్ ద్వారా ఎలా పొందాలి, ఎవరు అర్హులు వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఆయుష్మాన్ వే వందన కార్డ్ ఏంటి?
ఆయుష్మాన్ వే వందన కార్డ్ అనేది ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రత్యేక ఆరోగ్య గుర్తింపు కార్డు. దేశమంతటా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సంవత్సరానికి ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స పొందవచ్చు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని 2018లో పీఎం నరేంద్ర మోదీ ప్రారంభించారు. 55 కోట్లకు పైగా ప్రజలలో దాదాపు 40 శాతం కవర్ చేస్తుంది. కాగా, అక్టోబర్ 29, 2024 నుంచి ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పౌరులందరూ ఆయుష్మాన్ వే వందన పథకాన్ని అమలు చేస్తున్నారు. దీని ద్వారా సీనియర్ సిటిజన్లకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా కవరేజ్ వస్తుంది. ఈ కార్డు ముఖ్యంగా వృద్ధుల ఆరోగ్య అవసరాలను తీర్చడానికే రూపొందించారు. కాగా, అంతకు ముందున్న వ్యాధులన్నింటికీ కూడా కార్డు తీసుకున్న మొదటి రోజు నుంచే చికిత్స అందుతుంది. ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ ఉండదు.
ఈ కార్డు ఎలా పొందాలి?
ఆయుష్మాన్ వయ వందన కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి, మీరు ఆయుష్మాన్ యాప్ ఉపయోగించాలి. యాప్‌లోకి లబ్ధిదారుడిగా లేదా ఆపరేటర్‌గా లాగిన్ అవ్వాలి. మీ మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్ ఇచ్చి, ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. మీ రాష్ట్రం పేరు, ఆధార్ నంబర్ సహా మీ వివరాలను నమోదు చేయాలి. ఒకవేళ మీ పేరు జాబితాలో లేకపోతే, eKYC ప్రక్రియను పూర్తి చేయండి. ఓటీపీ వస్తుంది, దానికి అనుమతి ఇవ్వండి. అవసరమైన చోట మీ వివరాలు నింపి, డిక్లరేషన్ సమర్పించండి. తర్వాత మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయండి. పిన్ కోడ్ వంటి అదనపు వివరాలు నింపి, మీ కుటుంబ సభ్యుల సమాచారం యాడ్ చేసి సబ్మిట్ చేయండి. చివరగా, ఫారమ్‌ను సమర్పించండి. ఈ eKYC ప్రక్రియ విజయవంతంగా పూర్తయి, ఆమోదం పొందిన తర్వాత, మీరు మీ ఆయుష్మాన్ వే వందన కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు
ఈ ఆయుష్మాన్ వే వందన కార్డు ఉన్న సీనియర్ సిటిజన్లు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, కార్డియాలజీ, ఆంకాలజీ, హెమోడయాలసిస్, టోటల్ హిప్ రీప్లేస్మెంట్, టోటల్ నీ రీప్లేస్మెంట్ వంటి 1961 రకాల వైద్య విధానాలకు (ప్రొసీజర్స్), 27 మెడికల్ స్పెషాలిటీలలో నగదు రహిత చికిత్స పొందొచ్చు. ఇందులో గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్, ఎముకలు, సర్జరీలు, డయాలసిస్ వంటి అనేక రకాల చికిత్సలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 13,352 ప్రైవేటు ఆస్పత్రులతో సహా మొత్తం 30,072 ఆస్పత్రుల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. 1800 11 0770 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి.