పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న ఓ సర్జన్.. అత్యంత క్రూరమైన నేరాలకు పాల్పడ్డాడు. 299 మంది రోగులపై లైంగిక వేధింపులు, అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితుల్లో అత్యధిక మంది చిన్నారులేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఫ్రాన్స్‌లో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ కేసులో నిందితుడైన 74 ఏండ్ల జోయెల్ లి స్కౌర్నెక్.. కోర్టులో నేరాన్ని అంగీకరించాడు. సోమవారం ఈ కేసులో కోర్టు విచారణ సందర్భంగా అతడు మాట్లాడుతూ, ‘అత్యంత క్రూరమైన చర్యలకు పాల్పడ్డా. ఎంతోమందిని లైంగికంగా వేధించా. అత్యాచారానికి పాల్పడ్డా. చేసిన తప్పులకు బాధ్యత వహిస్తున్నా’ అని అన్నాడు. ఈ కేసులో న్యాయస్థానం 2020లో జోయెల్‌ను దోషిగా తేల్చి, 15 ఏండ్ల జైలు శిక్ష విధించింది.
ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయగా.. షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. న్యాయస్థానం అతడికి మరో 20 ఏండ్ల జైలు శిక్ష విధించే అవకాశముంది. 1989 నుంచి 2014 వరకు 299 మందిపై అత్యాచారానికి పాల్పడినట్టు అతడు కోర్టుకు తెలిపాడు. వీరిలో అత్యధికులు చిన్నారులేనని పేర్కొన్నాడు. జోయెల్ మానసికంగా విపరీత ఆలోచనా ధోరణి కలిగిన ‘మేజర్ పర్వర్ట్’గా వైద్యులు తేల్చారు. నిందితుడు జోయెల్ ఫ్రాన్స్‌లోని ఓ దవాఖానలో సర్జన్‌గా పనిచేసేవాడు. రోగులు మత్తులో ఉండగా లైంగికదాడి జరిపినట్టు తెలిపాడు. అతడి ఇంట్లో సోదాలు జరుపగా మూడు లక్షలకుపైగా ఫొటోలు, 650 వరకు అశ్లీల వీడియోలు బయటపడ్డాయి.