NEET-UG 2024 : నీట్ యూజీ 2024 అవకతవకలపై సీబీఐ.. ఈడీ దర్యాప్తు

సుప్రీంకోర్టులో పిటిషన్..!;

Update: 2024-06-23 01:30 GMT

నీట్ యూజీ-2024 పరీక్షలో అవకతవకలపై సీబీఐ, ఈడీ దర్యాఫ్తునకు ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో శనివారం పిటిషన్ దాఖలైంది. నీట్ పరీక్ష రాసిన 10 మంది అభ్యర్థులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, అవకతవకలపై బీహార్ పోలీసులు త్వరితగతిన దర్యాఫ్తు పూర్తి చేసి, సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాలని వారు పిటిషన్‌లో కోరారు. నీట్ యూజీ 2024 పరీక్ష రద్దుతో తలెత్తే పరిణామాల గురించి పూర్తిగా తెలుసునని... కానీ ఇంతకుమించి తమకు ప్రత్యామ్నాయం లేదని పిటిషనర్లు పేర్కొన్నారు.

నీట్ పరీక్ష నిర్వహణ పలు అవకతవకలతో కూడుకున్నదని... పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు సకాలంలో ప్రశ్నాపత్రాలు అందించలేదని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. మరికొన్నిచోట్ల తప్పుడు సెట్ ప్రశ్నాపత్రాలు ఇచ్చి తర్వాత వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలో, నీట్ యూజీ 2024 రద్దుతో పాటు కోర్టు పర్యవేక్షణతో దర్యాఫ్తు చేయాలని దాఖలైన పిటిషన్ల మీద అభిప్రాయాలు తెలపాలని కేంద్ర ప్రభుత్వానికి, ఎన్టీఏలకు సుప్రీంకోర్టు ఇదివరకే నోటీసులు జారీ చేసింది. అయితే నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియను నిలిపివేయబోమని స్పష్టం చేసింది.

నీట్ యూజీ 2024 పరీక్షలో అవకతవకలను నిరసిస్తూ పలు నగరాల్లో విద్యార్థులు, విపక్ష పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయి. గత నెల ఐదో తేదీన దేశవ్యాప్తంగా 4750 కేంద్రాల్లో సుమారు 24 లక్షల మంది విద్యార్థులు నీట్ యూజీ 2024 పరీక్షకు హాజరయ్యారు. వాస్తవంగా ఈ నెల 14న వెల్లడించాల్సిన నీట్ పరీక్షా ఫలితాలు ఈ నెల నాలుగో తేదీనే ప్రకటించారు.

అయితే ఎన్టీఏ చరిత్రలోనే 67 మంది విద్యార్థులకు 720 మార్కులకు వందశాతం మార్కులు వచ్చాయి. హర్యానాలోని ఫరీదాబాద్ లో ఆరుగురు విద్యార్థులకు వందశాతం మార్కులు వచ్చాయి. 67 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపడం వల్లే వందశాతం మార్కులు వచ్చాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ తదితర యూజీ వైద్య విద్యాకోర్సుల్లో అడ్మిషన్ల కోసం ప్రతి ఏటా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ).. ‘నీట్ యూజీ’ పరీక్ష నిర్వహిస్తోంది.

Tags:    

Similar News