Fuel Crisis : పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. అదనపు సిలిండర్లు బుక్ చేయొద్దు.. ప్రజలకు సర్కార్ విజ్ఞప్తి.
Fuel Crisis : అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ముడి చమురు సరఫరాపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. అయితే, భారతీయులు ఈ విషయంలో అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన భరోసా ఇచ్చింది. దేశంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ సరఫరా పూర్తిగా సురక్షితంగా ఉందని, ఎక్కడా కొరత ఏర్పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని కేంద్రం ప్రకటించింది. యుద్ధం కారణంగా ధరలు పెరుగుతాయేమో అన్న భయంతో ప్రజలు గ్యాస్ సిలిండర్లను అత్యధికంగా బుక్ చేసుకోవద్దని కోరింది.
తాజా గణాంకాల ప్రకారం.. దేశంలో ఎల్‌పీజీ బుకింగ్స్‌లో కొంత తగ్గుదల కనిపించింది. మార్చి 13న సుమారు 88.8 లక్షలుగా ఉన్న బుకింగ్స్, గత రెండు రోజుల్లో 77 లక్షలకు పడిపోయాయి. అంటే దాదాపు 12 లక్షల బుకింగ్స్ తగ్గాయి. ప్రజలు డిజిటల్ విధానాల వైపు మొగ్గు చూపుతుండటంతో ఇప్పుడు దాదాపు 87 శాతం బుకింగ్స్ ఆన్‌లైన్ ద్వారానే జరుగుతున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. దీనివల్ల డీలర్ల వద్ద క్యూలో నిలబడాల్సిన అవసరం లేదని, పారదర్శకత కూడా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
భారతదేశం పెట్రోల్, డీజిల్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించిందని, దేశీయ అవసరాల కోసం వీటిని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం మరోసారి గుర్తుచేసింది. దేశంలోని అన్ని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, సరిపడా ముడి చమురు నిల్వలు మన వద్ద ఉన్నాయని భరోసా ఇచ్చింది. ఎక్కడా పెట్రోల్ బంకుల వద్ద గానీ, గ్యాస్ ఏజెన్సీల వద్ద గానీ ఇంధనం లేదనే ఫిర్యాదులు రాలేదని చమురు కంపెనీలు స్పష్టం చేశాయి.
ముఖ్యంగా సామాన్య వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గృహ అవసరాలకు, ఆసుపత్రులకు, విద్యాసంస్థలకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బీహార్, ఢిల్లీ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కమర్షియల్ గ్యాస్ వినియోగంపై ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలు విడుదల చేశారు. ఇళ్లలో వాడే గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసినా లేదా బ్లాక్ మార్కెట్‌లో విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
యుద్ధం సాకుతో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిపై ఉక్కుపాదం మోపేందుకు ఆంధ్రప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే దాడులు ప్రారంభమయ్యాయి. చమురు కంపెనీల అధికారులు కూడా గ్యాస్ ఏజెన్సీల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. దేశంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, కాబట్టి ప్రజలు అనవసరంగా భయాందోళనలకు గురై అదనపు సిలిండర్లను బుక్ చేయవద్దని కేంద్రం విజ్ఞప్తి చేసింది.