UP: తీసుకున్న డబ్బు అడిగినందుకు ప్రియుడిని భర్తతో కలిసి చంపేసిన ప్రియురాలు..

హతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు;

Update: 2025-08-11 02:30 GMT

ఇటీవల వివాహేతర సంబంధాలు హత్యలకు దారితీస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం వెలుగుచూసింది. ఒక మహిళ వివాహేతర సంబంధం కొనసాగించడమే కాక, తీసుకున్న డబ్బులు ఇవ్వమని ప్రియుడు అడిగినందుకు నమ్మకంగా ఇంటికి పిలిచి భర్తతో కలిసి ప్రియుడిని హత్య చేయడం కలకలం రేపింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆ మహిళను, ఆమె భర్తను అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సాంభాల్‌లో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. రయూస్ అహ్మద్, సితార దంపతులు. పొరుగింటికి చెందిన 45 ఏళ్ల అనీశ్‌తో సితారకు వివాహేతర సంబంధం ఉంది. శనివారం రాత్రి అనీశ్‌ను తన ఇంటికి పిలిపించిన సితార.. అక్కడకు వచ్చిన అతనిపై భర్త రయాస్ అహ్మద్‌తో కలిసి దాడి చేసింది. స్క్రూడ్రైవర్‌తో పొడిచి, కటింగ్ ప్లేయర్ వంటి పరికరాలతో హింసించింది. తీవ్ర గాయాలతో అక్కడి నుంచి తప్పించుకుని తన ఇంటికి వచ్చిన అనీశ్ ఆ తర్వాత మరణించాడు.

ఈ ఘటనపై మృతుడు అనీశ్ తండ్రి ముస్తాకిమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పొరుగింటి కుటుంబానికి తన కుమారుడు గతంలో ఏడు లక్షలు అప్పు ఇచ్చాడని, ఇటీవల తన కుమారుడికి పెళ్లి కుదరడంతో డబ్బు తిరిగి ఇవ్వమని అడిగేందుకు వెళితే ఆ దంపతులు దారుణంగా హింసించి హత్య చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

అనీశ్ మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా, అనీశ్‌కు సితారతో వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే అనీశ్‌ను తన ఇంటికి పిలిపించిన సితార.. భర్తతో కలిసి హింసించి హత్య చేసిందని పోలీస్ అధికారి తెలిపారు. అనీశ్ హత్యకు కారకులైన భార్య, భర్తలను అరెస్టు చేసినట్లు చెప్పారు. 

Tags:    

Similar News